రాయపోల్ ఆగస్టు 12: రైతు బీమా దరఖాస్తులకు (Rythu Bima) బుధవారం చివరి రోజు కావడంతో కొత్త పట్టా పాస్ బుక్ కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ అన్నారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో దరఖాస్తుల పరిశీలనను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆగస్టు 13వ తేదీ లోపు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. 2025 జూన్ 5వ తేదీ వరకు నూతనంగా పట్టాదారు పాస్ బుక్ వచ్చినవారు దరఖాస్తులకు అర్హులని పేర్కొన్నారు.
2025కుగాను రైతు బీమా నమోదు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు చేపట్టారు. అలాగే ఇంతకుముందే పట్టా పాస్ బుక్ ఉండి రైతు బీమా నమోదు చేసుకొని 18 నుంచి 59 ఏండ్లలోపు వయసు గల పట్టాదారులు కూడా దరఖాస్తు చేసుకోవాలి… ఇంతకుముందే రైతు బీమా నమోదు చేసుకున్న రైతులు ఎలాంటి దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. అలాగే ఇంతకు ముందు సంవత్సరాలలో రైతు బీమా నమోదు చేసుకొని ఇప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే.. రైతులు ఆగస్టు 12వ తేదీలోపు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని తెలిపారు. దరఖాస్తు ఫారంతో పాటు రైతు ఆదార్ కార్డు జిరాక్స్, ఫట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, నామిని ఆదార్ కార్డు జిరాక్స్ తీసుకుని రైతు స్వయంగా ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్, రజిత, కవిత, స్వర్ణలత, రైతులు పాల్గొన్నారు.