పటాన్చెరు, డిసెంబర్ 30: సంక్షేమం, అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం పటాన్చెరు మండలం పోచారంలో ప్రజాపాలనలో ఆయన పాల్గొని, ఆరు గ్యారెంటీల దరఖాస్తుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందజేసే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చే బాధ్యత యంత్రాంగానిదేనన్నారు. దరఖాస్తులు ఇచ్చి కౌంటర్లలో రసీదు తీసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ సుష్మాశ్రీరెడ్డి, జడ్పీటీసీ సుప్రజారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో బన్సీలాల్, ఎంపీవో హరిశంకర్‌గౌడ్, సర్పంచ్ జగన్ పాల్గొన్నారు.
అమీన్పూర్ బంధంకొమ్ములో..
అమీన్పూర్, డిసెంబర్ 30: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు బంధంకొమ్ము ప్రాథమిక పాఠశాలలో అభయహస్తం దరఖాస్తుల స్వీకరణలో మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి వార్డులో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల సౌకర్యార్థం సరిపడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శరత్ కుమార్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, కౌన్సిలర్లు కాట సుధా శ్రీనివాస్‌గౌడ్, శశిధర్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
రామచంద్రపురంలో..
రామచంద్రాపురం, డిసెంబర్ 30: అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీలోని విద్యుత్‌నగర్ 5వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఏర్పాటుచేసిన కౌంటర్లను పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ విషయమై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులతో మాట్లాడారు. అర్హులకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్ శరత్, చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, కౌన్సిలర్లు బాబ్జీ, లచ్చిరాం, శ్రీశైలం, పావనిప్రసన్న, రెడ్డి సరిత, మయూరి, మంజూల, కాట సుధారాణి, కాంగ్రెస్ ఇన్చార్జి కాటశ్రీనివాస్గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, రవీందర్, శ్యాంరావు, అవినాశ్‌గౌడ్, అరుణ్గౌడ్, వాజిద్ పాల్గొన్నారు.