సంగారెడ్డి, మే 18(నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన హరితహారం కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురవుతుంది. అంతరించిపోతున్న అడవుల విస్తీర్ణం పెంచడంతో పాటు గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు కేసీఆర్ సర్కార్ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాలు, పట్టణాలు, అడవులు అన్నిప్రాంతాల్లో మొక్కలు నాటేలా కేసీఆర్ సర్కార్ చొరవ తీసుకుంది. సంగారెడ్డి జిల్లాలో హరితహారం ద్వారా తొమ్మిది విడతల్లో 9.44 కోట్ల మొక్కలు నాటింది. దీంతో సంగారెడ్డి జిల్లాలో అడవులు విస్తీర్ణం పెరగడంతో పాటు గ్రామాల్లో పచ్చదనం పర్చుకుంది. ప్రజలతోపాటు ప్రకృతికి మేలు చేసే హరితహారం కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభు త్వం తిలోదకాలు ఇస్తుంది. జిల్లాలో హరితహారం కింద నాటిన మొక్కల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఫలితంగా గ్రామాల్లో నాటిన మొక్కలతోపాటు నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం తీరును ప్రజలతోపాటు పర్యావరణవేత్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రజలు మేలుచేసే మొక్కల పెంపకాన్ని ప్రభు త్వం నిర్లక్ష్యం చేయటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ సర్కార్..హరితహారానికి పెద్దపీట
కేసీఆర్ సర్కార్ హరితహారానికి పెద్దపీట వేసి సంగారెడ్డి జిల్లాలో 647 నర్సరీలు ఏర్పా టు చేసింది. గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు ఇండ్లల్లో పెంచేందుకు పూలు, పండ్ల మొక్కలను ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. 2015 నుంచి 2023 వరకు 10. 72 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా 9.44కోట్ల మొక్కలను కేసీఆర్ సర్కారు పెంచింది.
కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న మొక్కలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హరితహారం అటకెక్కిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. కానీ ఇప్పటివరకు అధికారులకు ఎలాంటి అదేశాలు ఇవ్వలేదు. దీంతో హరితహారం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు హరితహారంలో నాటిన మొక్కల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో వేసవిలో నీళ్లులేక మొక్కలు ఎండిపోతున్నాయి. నర్సరీల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. కమ్యూనిటీ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్, రోడ్‌సైడ్ ప్లాంటేషన్ పేరుతో 30 లక్షలకు పైగా మొక్కలు నాటింది. ఇందులో అవెన్యూ, రోడ్‌సైడ్, ట్యాంక్‌బండ్ ప్లాంటేషన్ పేరుతో గ్రామాలు, చెరవుల వద్ద నాటిన మొక్కలు నిర్వహణ లేక ఎండిపోతున్నాయి.