రాయపోల్, జూన్17: రైతుల కోసం ప్రభుత్వం, సంస్థలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిరాశ కలిగించింది. అధికారులు, వ్యవసాయ శాఖ విభాగం ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ అసలు లక్ష్యం గా ఉన్న రైతులు మాత్రం గైరాజరయ్యారు. రైతు వేదికల వద్ద ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించింది. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం, సాంకేతిక పరిజ్ఞానం అందించడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కానీ రాయపోల్ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి రైతులు మాత్రం హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో చాలావరకు కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. దీంతో రైతులు వస్తారేమోనని అధికారులు చాలాసేపటి వరకు ఎదురుచూశారు. అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో తూతూ మంత్రంగానే కార్యక్రమాన్ని ముగించారు.