శివ్వంపేట, ఫిబ్రవరి 29 : మెదక్ జిల్లా శివ్వంపేటలో వెలసిన బగలాముఖి శక్తిపీఠంలో ఏదో తెలియని మహత్యం ఉందని, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ప్రశాంతత కలిగిందని, ఏదో కొత్తదనం చూశానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రు హరీశ్‌రావు అన్నారు. బగలాముఖి శక్తిపీఠం ప్ర థమ వార్షికోత్సవంలో భాగంగా రెండోరోజు గురువారం హరీశ్‌రావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ సంకల్ప బలంతో శక్తిపీఠం నిర్మాణం చేసుకోవడం శివ్వంపేట ప్రజల అదృష్టమన్నారు. అందరికీ మంచి జరగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. బగలాముఖి శక్తిపీఠం నిర్మాణంలో భాగస్వాములైన జడ్పీటీసీ పబ్బమహేశ్ గుప్తా, పబ్బరమేశ్ గుప్తా, హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్‌గౌడ్ వారి జన్మను సార్ధకత చేసుకున్నారని అభినందించారు. శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ పట్టుదల, కార్యదీక్షతతో శక్తిపీఠం నిర్మాణం సాధ్యమైందన్నారు. తనను ప్రథమ వార్షికోత్సవానికి ఆహ్వానించిన జడ్పీటీసీ పబ్బమహేశ్ గుప్తాకు, వారి బృందానికి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు.
ఉత్సవాల్లో శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో గోదావరి జలాలతో అష్టోత్తర శత (108) కలశస్థాపన, 108 కలశ జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. సహస్త్ర పుష్ప సహిత హరిద్రార్చన, పూర్ణాహుతి, మహామంగళ నీరాజనం నిర్వహించా రు. ప్రముఖ వ్యాపారవేత్త చిలువేరు శాంతన్కుమా ర్ గుప్తా, సంగీత దంపతుల ఆధ్వర్యంలో 5వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. కేరళ డోలు వాయిద్యం ఆకర్షణగా నిలిచింది. ఉత్సవాలను విజయవంతం చేసిన అందరికీ, పబ్బ మహేశ్‌గుప్తా భక్తుల కోసం టెంట్లు, చలువ పందిళ్లు, పూలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేయించడంపై వెంకటేశ్వరశర్మ కృతజ్ఞతలు తెలిపారు.
లలిత త్రిపుర సందరీదేవి పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతిస్వామి, మాధవనంద సరస్వతిస్వామి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణ శర్మ దంపతులు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, గోల్డ్ మెన్ చిన్నాబాయ్తోపాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, సిం గాయపల్లి గోపి, మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పబ్బ రమేశ్ గుప్తా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణగౌడ్, తూము కృష్ణారావు, జ్ఞానేశ్వర్, పద్మా వెంకటేశ్, వంజరి కొండల్, పోచగౌడ్ తదితరులు పాల్గొన్నారు.