సిద్దిపేట : కరోనా బారినపడి పనికి వెళ్లలేక పస్తులుంటున్న తల్లీకుమారుడికి మంత్రి హరీశ్ రావు ఆపన్నహస్తం అందించారు. తన ప్రతినిధులను వారి వద్దకు పంపి కావాల్సినవి సమకూర్చారు. కష్టకాలంలో తానున్నానంటూ మనోధైర్యాన్ని నింపి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎడమ ఎల్లవ్వ, ఆమె కుమారుడు పరుశురాం ఇటీవల కరోనా బారిపడ్డారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి వారిది. కరోనా కారణంగా పనికి వెళ్లలేకపోవడంతో చేతిలో పైసలు లేకుండాపోయాయి. ఇంట్లో బియ్యం, ఇతర సామగ్రి అయిపోవడంతో పస్తులే దిక్కయ్యాయి.
వీరి దీనావస్థపై పలు పత్రికల్లో కథనాలు రావడంతో నెటిజన్లు ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన తన తరుఫున ఓ ప్రతినిధి బృందాన్ని వారింటికి పంపి కావాల్సిన వస్తువులను సమకూర్చారు. కొంతకాలం దేనికి ఇబ్బంది లేకుండా నగదును సైతం అందజేశారు. విషయం తెలిసిన గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబాన్ని ఆదుకున్నట్లు మంత్రి హరీశ్ రీట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Our team has reached out and necessary help has been provided. https://t.co/TD0GJsvpeH pic.twitter.com/EEPLRXpxWS
— Harish Rao Thanneeru (@trsharish) May 29, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.