తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రా పాలకులు చీడపురుగులా చూస్తున్న సమయం.. పల్లెల్లో పల్లేర్లు మొలిచి పొట్ట చేతపట్టుకుని వలసెల్లిపోయిన రోజులు.. నీళ్లు, నిధులు, నియామకాలు ఇలా ప్రతీ విషయంలో అన్యాయం చేస్తూ పాలన పేరును చేతిలో పట్టుకున్న అప్పటి నాయకులకు అడ్డం చెప్పేటోళ్లు లేరు. గొర్రెల మంద మధ్య పులిలా ఎగిసి వచ్చింది ఓ ఉద్యమ కెరటం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలంటే ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరుబాట పట్టాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉరకలెత్తించాలంటే మనకంటూ ఓ వేదిక కావాలని 2001లో టీఆర్ఎస్ను ఏర్పాటు చేశాడు. గులాబీ జెండా చేతపట్టుకుని రాష్ట్రం సాధించేవరకు పోరాటం ఆపలేదు.
సరిగ్గా 21ఏండ్ల క్రితం స్వరాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన సమితి (టీఆర్ఎస్) ఊపిరి పోసుకుంది. ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలపై గళమెత్తింది. ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సబ్బండవర్ణాలను ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసింది. సాధారణ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి పాలనా పగ్గాలు చేపట్టింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి యావత్తు దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. పార్టీ పురుడు పోసుకుని రేపటితో 21 ఏండ్లు పూర్తి అవుతుండగా, ఆవిర్భావోత్సవ సభను హైదరాబాద్‌లో ప్లీనరీ వేడుకలను జరుపుకోనున్నది. అదే రోజు గ్రామ గ్రామాన టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి పార్టీ పండుగను ఘనంగా జరుపుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆహ్వానం అందిన వారంతా ప్లీనరీకి హాజరుకానున్నారు. ఆ దిశగా గ్రామాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
సిద్దిపేట, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తి చేసుకొని 22వ యేటా అడుగు పెడుతున్న నేపథ్యంలో రేపు(బుధవారం) ఆవిర్భావోత్సవ సభను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్లీనరీ వేడుకలను జరుపుకొంటున్నది. అదే రోజు గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ జెండాను అవిష్కరించి పార్టీ పండుగను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆహ్వానం అందిన వారంతా హైదరాబాద్‌లో నిర్వహించే ప్లీనరీకి హాజరుకానున్నారు. ఆ దిశగా గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావించిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఎన్నో ఉద్యమాలను చేసింది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. సీమాంధ్ర పాలకుల చేతిలో దగా పడుతున్న తెలంగాణ సమాజాన్ని తట్టి లేపింది. టీఆర్ఎస్ పార్టీకి పుట్టినిల్లుగా సిద్దిపేట (ఉమ్మడి మొదక్) జిల్లా చరిత్రలో నిలిచిపోయింది. సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో పుట్టిన కేసీఆర్ ఇవాళ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక నేతగా మారారు. యావత్ దేశం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం సాధించాక ఎనిమిదేండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్నింటా అగ్రభాగాన నిలిపారు. పలు రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. ఇక్కడ అమలు జరుగుతున్న పలు పథకాలు, సంక్షేమ పథకాలను దేశంలోని వివిధ రాష్ర్టాలల్లో అమలు చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి బీడు వారిన పొలాలకు పారించడంతో ఈరోజు భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. మండు టెండల్లో సైతం చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలనను అందించడంతో రెండు పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధన కోసం అహర్నిషలు కృషి చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ సంస్కరణలు చేపట్టారు. జిల్లాల పునర్విభజనతో పరిపాలనను ప్రజల చెంతకు చేర్చారు. ప్రతి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను నిర్మించారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదు. ప్రతిపక్ష పార్టీలు ఈ జిల్లాలో నామమాత్రమే అని చెప్పాలి.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఇలా..
2001 ఏప్రిల్ 14న సిద్దిపేటలో జరిగిన అంబేద్కర్ జయంతి సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం తప్పదని ప్రకటించారు. ఉద్యమ పార్టీ ఆవిర్భావాన్ని కూడా ఆ రోజే వెల్లడించారు. 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీని స్థాపించారు. ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ యావత్ సమాజం పులకించింది. ఏప్రిల్ 27న ఉదయమే కేసీఆర్‌కు ఇష్టదైవమైన నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జెండా క్యాసెట్లను వెంకన్న స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం జై తెలంగాణ.. జైజై తెలంగాణ .. అంటూ ఉద్యమ జెండాను భుజానెత్తుకుని సుమారు వెయ్యి వాహనాల్లో భారీ కాన్వాయ్‌గా హైదరాబాద్‌కు బయలుదేరారు. సిద్దిపేట నియోజక వర్గంలోనిముఖ్య నాయకులు, కార్యకర్తలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు చెందిన వందలాది మంది ఆయనను అనుసరించారు. రాజీవ్ రహదారి పొడవునా కాన్వాయ్‌తో నిండిపోయింది.
హైదరాబాద్‌లోని తన స్వగృహం వరకు డిప్యూటీ స్పీకర్ హోదాలో ప్రభుత్వ వాహనంలో ప్రయాణించిన కేసీఆర్ అక్కడి నుంచి తన సొంత వాహనంలో బయలుదేరి హుస్సే న్ సాగర్ సమీపంలోని జలదృశ్యం సభావేదిక వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆయన ఏం చేస్తున్నారన్న ఉత్కంఠ తెలంగాణ ప్రజల్లో ఉంది. సభలో తన మనస్సులో మాట బయటపెట్టారు. తెలంగాణ కోసం తన పదవులకు రాజీనామా చేస్తూ మూడు లేఖలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ సభ్యత్వం, పార్టీ పదవులకు ఒకే సారి రాజీనామా చేసి ఆ సమయంలో ఒక రికార్డు నెలకొల్పారు. పదవుల కోసం కాదు.. ప్రజల కోసం పోరాటమంటూ తన లక్ష్యాన్ని ప్రకటించారు. పదవులు వదలుకోవడమనేది అప్పటి వరకు ఎవరు ఊహించని చర్య. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమ పార్టీ స్థాపించారు.
రంగధాంపల్లి వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్ష
సిద్దిపేట రంగధాంపల్లి వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగుతానని ప్రకటించడంతో మరోసారి జిల్లా వార్తల్లోకెక్కింది. ఆమరణ దీక్ష బయలుదేరిన కేసీఆర్‌ను నవంబర్ 29న కరీంనగర్ శివారులో పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలించగా, సిద్దిపేట దీక్షా స్థలి వద్ద హరీశ్‌రావు, రామలింగారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి తదితర నాయకులు దీక్షకు సిద్ధమవడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఆ దీక్షాస్థలిని అణచివేయడం, హరీశ్‌రావు దీక్షా స్థలి వేదికపైనే ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది.. ఉద్యమం ఉధృతమైంది. జిల్లాలో ఉద్యమంలో భాగంగా 2011లో జహీరాబాద్ శివారులో హరీశ్‌రావు నేతృత్వంలో 65వ నంబరు జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. రైలురోకోలతో సికింద్రాబాద్, ముంబై, నిజామాబాద్ మార్గాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. తెలంగాణ కోసం రోడ్లపై వంటావార్పు, రోడ్ల దిగ్బంధం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు నాంది ఇక్కడే
1985 నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఓటమెరుగక సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (ప్రస్తుత ముఖ్యమంత్రి) రాష్ట్ర మంత్రిగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పలు పదవులు నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన జన్మభూమి పథకం రూపకల్పనలో ఆయన పాత్ర ముఖ్యమైంది. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన చంద్రశేఖర్‌రావుకు అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఓ వైపు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తప్పుబట్టారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయంపై పిడికిలెత్తారు. అధికార పార్టీలో ఉండి పోరాటం చేయడం కన్న ఎదురు నిలిచి ఉద్యమించాలని నిర్ణయించారు.
ప్రతీ పల్లెలో గులాబీ జెండా పండుగ ఉత్సవంలా నిర్వహించాలి
– ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీగా ఒక రాష్ర్టాన్ని సాధించింది.. అన్ని రంగాలను అగ్రగామిగా నిలుపుతున్న పార్టీకి 21 ఏండ్లు నిండాయి. రేపు టీఆర్ఎస్ పార్టీ 21 ఏండ్ల ఆవిర్భావం సందర్భంగా హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహిస్తున్నారు. దీనికి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులకు మాత్రమే ఆహ్వానం ఉంది. మిగతా పార్టీ శ్రేణులు అందరూ పట్టణంలోని అన్ని వార్డులలో వార్డు పార్టీ అధ్యక్షులు, గ్రామాల్లో గ్రామ శాఖ అధ్యక్షులు, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు జెండా ఎగురవేయాలి. ప్రతీ పల్లెలో గులాబీ జెండాలు రెపరెపలాడాలి. పండుగలా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి. ఈ కార్యక్రమం గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులు, పార్టీ కమిటీలు అనుబంధ కమిటీ సభ్యలు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి.
ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట
2014, 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాలో విజయదుందుభిని మోగించింది. 10 అసెంబ్లీ స్థానాలకు గాను 8 చోట్ల టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి తమ సత్తాను చాటుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు గాను రెండింట్లో విజయాన్ని సాధించింది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కలిగింది. దీంతో గజ్వేల్ శాసన సభ స్థానం నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారిగా 2014 జూన్ 2న సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి సీఎంగా 2018 డిసెంబర్ మాసంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రి వర్గంలో హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారి ప్రభుత్వంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా, రెండోసారి ప్రభుత్వంలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. తొలి ప్రభుత్వంలో జిల్లాలో పద్మాదేవేందర్‌రెడ్డికి డిప్యూటీ స్పీకర్‌గా పదవి సీఎం కేసీఆర్ కట్టబెట్టారు. మెదక్ పార్లమెంట్ నుంచి కేసీఆర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌గా దివగంత నేత సోలిపేట రామలింగారెడ్డికి పదవి వరించింది. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ బావుటా ఎగురవేసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌తో పాటు మండల పరిషత్ స్థానాలను కైవసం చేసుకుంది. మానకొండూరు శాసనసభ్యులు రసమ యి బాలకిషన్ రాష్ట్ర సాంస్కతిక చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
రెండోసారి అధికారంలోకి..
టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అందిస్తున్న పాలనతో అన్ని వర్గాల ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పగించారు. 2018 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 శాసనసభ స్థానాలకు గాను 9 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. సిద్దిపేట జిల్లాలో కలిసిన హుస్నాబాద్, జనగామ శాసనసభ స్థానాల్లో సైతం టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఏ ఎన్నికల్లో ఎవరికి రానీ మెజార్టీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చింది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లక్షా 18 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. వెనువెంటనే వచ్చిన పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటింది. మెదక్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ ఎంపీలుగా విజయం సాధించారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మన్ పీఠాలను సొంతం చేసుకుంది. దీంతో పాటు ఎంపీపీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం 90శాతం పైగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. ఇలా ఎన్నికలు ఏవైనా అది టీఆర్
ఎస్ పార్టీ సొంతం. నాలుగు నెలల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లానుంచి ఎమ్మెల్సీగా గజ్వేల్ ప్రాంతానికి చెందిన వంటేరి యాదవరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసిన వెంకట్రామ్రెడ్డి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గ్రామ గ్రామన పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను వేసుకొని కొత్త రక్తంతో పార్టీ ఉరకలు వేస్తుంది. సిద్దిపేట జిల్లాకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని, మెదక్ జిల్లాకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను పార్టీ అధ్యక్షుడిగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నియమించారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పార్టీ పదవులను పలువురి నాయకులకు కట్టబెట్టారు.