సిద్దిపేట, ఏప్రిల్ 6: రాష్ట్రంలోనే తొలిసారిగా ‘ఋతుప్రేమ’ కార్యక్రమానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం సిద్దిపేటలో శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 5వ వార్డులో మహిళలు,శిశువుల వ్యక్తిగత పరిశుభ్రత, హానికరమైన వ్యర్థాలు వెలువడని వార్డుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా బుధవారం సాయిగ్రేస్ స్కూల్ ఆవరణలో జరిగిన మార్గనిర్దేక కార్యక్రమంలో భాగంగా ‘ఋతుప్రేమ’ను సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం, డబ్బులు ఆదా, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ‘ఋతుప్రేమ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహిళల చైతన్య స్ఫూర్తితో మరో మార్పునకు నాంది పలికిన ఈ కార్యక్రమం, రాష్ట్రవ్యాప్తంగా అమలై దేశానికి సిద్దిపేట ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి ఆడబిడ్డకు ఋతుస్రావం అనేది సహజ పక్రియ అని, అది ప్రకృతి ధర్మం అన్నారు. రసాయనిక డైపర్లు వాడకంతో మహిళలు అనారోగ్యం పాలవుతున్నారని వైద్యులు చెబుతున్నారని, క్లాత్ప్యాడ్ల వాడకంలో సిద్దిపేట ప్రపంచానికి మార్గదర్శకం కావాలన్నారు.
శాస్త్ర సాంకేతిక రంగం విస్తరించిన నేటి ఆధునిక కాలంలోనూ ఆడపిల్లలు ఋతుస్రావం గురించి బహిరంగంగా మాట్లాడడం లేదని, దానిని గుప్త విషయంగా చూస్తున్నారని, దానిని ఆరోగ్య విషయంగా చూడాలన్నారు. బహిరంగంగా ఋతుస్రావం గురించి మాట్లాడక పోవడంతో ఇప్పటికే సమాజం అనేక విధాలుగా నష్టపోయిందన్నారు.అనేక మంది అమ్మాయిలు క్లిష్ట సమయాల్లో ఒత్తిడి జయించే ధైర్యం లభించక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆరోగ్యమంత్రిగా కాకుండా బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.ఋతుప్రేమ కార్యక్రమంతో దానిపై బహిరంగంగా చర్చ జరగడం, మహిళల చైతన్యానికి తొలి విజయం అన్నారు.
ఇదే స్ఫూర్తితో మహిళా సంఘాలు, వైద్యులు క్లాత్ ప్యాడ్స్ వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. క్లాత్ ప్యాడ్స్ వినియోగంతో ఆరోగ్యం, డబ్బు ఆదా, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత లాంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 35కోట్ల మంది ప్రజలు రసాయనిక ప్యాడ్లు వాడుతున్నట్లు సర్వేలో తేలిందని, మహిళల ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంత్రి కోరారు. రానున్న రోజుల్లో అన్ని వార్డుల్లో క్లాత్ ప్యాడ్లను పంపిణీ చేస్తామన్నారు. త్వరలో జిల్లాలోని మహిళా అధికారులు, ఉద్యోగులు, మెప్మా సిబ్బంది, మహిళా కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్, సీపీలకు మంత్రి హరీశ్‌రావు సూచించారు.
మార్పునకు సంకేతం..
మహిళలు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ‘ఋతుప్రేమ’ కార్యక్రమానికి ఎండలో సైతం చిన్న పిల్లలను తీసుకొని భారీగా తరలివచ్చారు. వారిలో వచ్చిన చైతన్యానికి, మార్పునకు ఇది నిదర్శంగా చెప్పవచ్చు. మహిళలకు మంత్రి హరీశ్‌రావు క్లాత్ ప్యాడ్లు, ఋతుస్రావ కప్పులు, బట్ట డైపర్లు పంపిణీ చేసి, వారిని అభినందించారు.
అవగాహన కల్పించాలి : వైద్యులు గాయత్రి, రమాదేవి
వైద్యులు గాయత్రి, రమాదేవి మాట్లాడుతూ ‘ఋతుప్రేమ’ కార్యక్రమం ఒక చైతన్య ప్రక్రియ అన్నారు. ప్రతి ముగ్గురు మరో ముగ్గురికి దీనిపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రస్తుత సమయంలో చిన్న పిల్లలకు ఋతుస్రావం వస్తున్నదని, వారిని చైతన్యం చేయాలన్నారు. మహిళ జీవితంలో పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ అని, ఆందోళన చెందవద్దన్నారు. క్లాత్ ప్యాడ్ల వినియోగంపై అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామన్నారు. తాము ప్రతిరోజు అందుబాటులో ఉంటామని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, కమిషనర్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్ వినో ద్,డాక్టర్ శాంతి, పద్మ, డాక్టర్లు పాల్గొన్నారు.
మహిళా అభ్యుదయానికి ప్రతీక
మహిళలు సహజంగా ఎదుర్కొంటున్న సమస్య పీరియడ్స్, ఇదే ప్రధాన ఎజెండా అంశంగా సమావేశం జరగడం మహిళా అభ్యుదయానికి ప్రతీక అని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పీరియడ్స్ విషయం మూడో కంటికి తెలియకుండా ఆడవారు జాగ్రత్తలు పాటించేవారని, అలాంటిది నేడు ఒక మార్పుకోసం సమావేశం నిర్వహించడం అభినందనీయమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఋతుస్రావ అలవాట్లు మార్చుకోవాలని కోరారు. వందల మంది మహిళలు కూర్చొని చర్చించడం గొప్పవిషయం అన్నారు. పాస్టిక్ ప్యాడ్ల స్థానంలో క్లాత్ ప్యాడ్స్ వినియోగం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిపారు. మార్పునకు సిద్దిపేట నాంది కావాలని ఆకాంక్షించారు.
-సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత