
స్వేచ్ఛ కోసం రక్తతర్పణం
బైరాన్‌పల్లి నెత్తుటిగాథకు 73ఏండ్లు..
జలియన్‌వాలాబాగ్‌ను మించిన నరమేధం
రజాకార్ల దాడిలో 118మంది అమరులు
నేడు బైరాన్‌పల్లిలో అమరవీరుల సంస్మరణ దినం
బైరాన్‌పల్లిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు..
చారిత్రక నేపథ్యం కల్గిన బైరాన్‌పల్లి గ్రామ అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు నాలుగేండ్ల క్రితం రూ.కోటి ఖర్చు చేసింది. బురుజు వద్ద సీసీ నిర్మాణంతో పాటు గ్రామంలో సీసీరోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాలను చేపట్టింది. గ్రామానికి డబుల్బెడ్రూంలు, విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేసింది. ప్రతి ఏటా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామంలో అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఏటా స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తూ వస్తున్నారు.
వీర బైరాన్‌పల్లి.. ఆ పేరులోనే వీరత్వం ఉంది. అంతకు మించి ఆ ఊరికి ఒక చర్రిత ఉంది. పోరాటమంటే ఎట్ల చేయాలి? అన్యాయాలపై ఎలా తిరగబడాలి? అని ఆ ఊరి ప్రజలు ఆనాడే నిరూపించగా, ఆ ఊరు ఎన్నో పోరాటాలకు స్ఫూర్తిని నింపింది. ఆ ఊరే మాతృభూమి విముక్తికి బీజం వేసింది. వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే ధూళిమిట్ట మండలంలోని వీర బైరాన్‌పల్లి. బైరాన్‌పల్లి నెత్తుటిగాథకు 73 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా పోరాట యోధులను యాది చేసుకుందాం.
మద్దూరు, ఆగస్టు 26 : మట్టి మనుషుల తిరుగుబాటు.. దోపిడీపై దండయాత్ర.. రజకార్ల మూకలపై నిప్పులయాత్ర.. అగ్నిజ్వాలలై మరిగిన నెత్తుటి మడుగు.. గడ్డికోసిన చేతులే కొడవళ్లు పట్టాయి. బువ్వ వండిన చేతులే బందూక్లు పట్టాయి. రజాకార్ల దుర్నీతికి వ్యతిరేకంగా పిడికిలెత్తాయి. సామాన్యులే సాయుధలై రణనినాదం చేశారు. రైతన్నలే నిప్పుకణికలై విప్లవ శంఖం పూరించారు. వీర యోధుల త్యాగాలకు నెత్తుటి సాక్ష్యమే వీర బైరాన్‌పల్లి. 1947 ఆగస్టు15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి, ప్రజలంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుతున్నారు. నిజాం రాజు ఏలుబడిలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం స్వేచ్ఛ వాయువులకు నోచుకోకపోవడంతో పాటు రజాకార్ల ఆగడాలకు బలై, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. గ్రామాల్లో రజాకార్లను ఎదుర్కొనేందుకు ప్రజలు ఎక్కడికక్కడ గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లి పోరుగున ఉన్న లింగాపూర్, ధూళిమిట్ట గ్రామాల మీద పడి రజాకారు మూకలు దోపిడీకి దిగారు. ఆయా గ్రామాల్లో దోచుకున్న సొత్తుతో బైరాన్‌పల్లి గ్రామం మీదుగా వెళ్తున్న రజాకార్లకు గ్రామ రక్షణ దళ సభ్యులు అడ్డుపడి, సొత్తును స్వాధీన పర్చుకోవడంతో పాటు రజాకార్లకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నాటి నుంచి బైరాన్‌పల్లి గ్రామంపై కక్ష కట్టిన రజాకార్లు, బైరాన్పల్లిపై రెండుసార్లు దాడి చేసి విఫలమయ్యారు. ఈ దాడిలో 20మంది రజాకార్లు చనిపోయారు. దీంతో బైరాన్‌పల్లి గ్రామాన్ని తిరుగుబాటు గ్రామంగా అప్పటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హాసీం ప్రకటించి, ఏ రోజైనా బైరాన్‌పల్లిని మట్టుబెడతానని శపథం చేశాడు. గ్రామంపై కక్ష పెంచుకున్న రజాకార్లు, ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశముందని, గ్రామంలో ఎవరూ ఉండొద్దని గ్రామ రక్షణ దళానికి దళం పంపిన వార్త చేరలేదు. ఎప్పటి లాగే రజాకార్లను ఎదిరిస్తామనే ధీమాతో గ్రామ నడిబొడ్డున ఉన్న బురుజును ప్రధాన రక్షణ కేంద్రంగా మలుచుకున్నారు.
ఒక్క రోజే 96 మందిని పొట్టన పెట్టుకున్న రజాకార్లు..
అది 1948 ఆగస్టు 27వ తేదీన సూర్యోదయం వేళ పల్లె నిదుర లేచే వేళవుతున్నది. అప్పటికే కొన్ని ఇండ్లలో రైతులు మేల్కొని, లేగలను పాల కోసం వదులుతున్నారు. వేకువ జామున 4గంటల ప్రాంతంలో తుపాకీ మోత, తోపుల పేలుళ్లు వినిపించాయి. వెనువెంటనే కొన్ని చావు కేకలు.. ఊరంత ఒక్కసారిగా ఉలికి పడింది. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో గ్రామస్తులు ఆందోళనకు లోనవుతున్నారు. నిజాం సైన్యాధిపతి ఖాసీం రజ్వీ సైనికులు (రజాకార్లు) గతంలో గ్రామంలో తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సుమారు 1200 మంది బలగంతో పాటు భారీ మందు గుండు సామగ్రి, తుపాకులు, తోపులతో దొంగచాటున గ్రామంలోకి ప్రవేశించారు. రజాకార్ల కదలికలను ఎప్పటికప్పుడు గ్రామ రక్షణ దళానికి చేరవేసే గ్రామ కాపరి విశ్వనాథ్భట్జోషి రజాకార్లకు దొరికిపోయాడు. ఉల్లెంగల వెంకటనర్సయ్య అనే గ్రామస్తుడిని రజాకార్లు పట్టుకోగా, అతడు తప్పించుకోని పారిపోయి రజాకార్లు గ్రామంలోకి చొర బడ్డారని పెద్దపెట్టున కేకలు వేశాడు. దీంతో గ్రామంలోని బురుజు మీదనున్న దళ కమాండర్ రాజిరెడ్డి అప్రమత్తమై, ప్రజలంతా తగిన రక్షణలో ఉండేందుకు నగారాను మోగించాడు. ఆ శబ్దం విన్న బైరాన్‌పల్లి వీరులు నిద్రలేచారు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్య నిద్ర మత్తు వదిలించుకునే లోపుగానే రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చి పడిన నిప్పు రవ్వలతో బురుజుపైన ఉన్న మందు గుండు సామగ్రి అంటుకొంది. దీంతో బురుజుపై నుంచి ఎదురు కాల్పులు జరపడానికి వీల్లేకుండాపోయింది. బురుజుకు రక్షణ కరువైంది. గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుపెట్టారు. అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికీ తిరిగి 96మందిని వెతికి పట్టుకొని పెడరెక్కలు విరిచి, జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. గ్రామం వెలుపల మృత దేహాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మ ఆటలను ఆడించారు. రజాకార్ల ఆగడాలను భరించలేక మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. రజాకార్ల దాడిలో 25మంది రజాకార్లు చనిపోగా, 118మంది గ్రామస్తులు చనిపోయారని రికార్డుల్లో ఉంది. ఆ సంఖ్య 150 పైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా రజాకార్లు బైరాన్పల్లితో పాటు కూటిగల్ గ్రామంపై పడి 30 మంది గ్రామస్తులను పొట్టన పెట్టుకున్నారు.
ఊరిని వల్లకాడుగా చేసిండ్రు..
రజాకారు మిల్ట్రీ ఊరి మీద పడి దొరికినోళ్లను దొరికినట్లుగా చంపి, ఊరిని వల్లకాడుగా చేసిండ్రు. లెంకలుగా గట్టి తుపాకులతో ఎంతో మందిని చంపిండ్రు. ఊరి మీదపడి ఇష్టమొచ్చిన రీతిగా దోపిడీ చేశారు. మహిళలను చిత్రహింసలు పెట్టిండ్రు. ఊరునిండా నెత్తురు డొల్లరింది. ఎటూ చూసినా పినుగలతో నిండిపోయింది. అప్పటి ఘోరాన్ని తలచుకుంటనే భయమేస్తది. మా ఊరి చరిత్రను రాబోయే తరాలకు తెలిసేలా పాఠ్యాంశాల్లో చేర్చాలె.
బైరాన్‌పల్లి పెన్షన్ ఫైల్ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది..
గ్రామంలో అర్హులైన సమరయోధులందరికీ పింఛన్ అందించాలి. సమరయోధుల పింఛన్‌కు సంబంధించిన ఫైల్ కేంద్రం వద్దనే పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, పింఛన్ మంజూరు చేయాలి. చారిత్రక నేపథ్యం ఉన్న బైరాన్‌పల్లి గ్రామ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో రూ.కోటి నిధులను ఖర్చు చేసింది.