రాయపోల్, ఏప్రిల్ 02 : ప్రజలతో పోలీసుల సత్సంబంధాలు పెంపొందించేందుకు సిద్దిపేట జిల్లాలో ‘మన ఊరు.. మన పోలీస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామంలో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ గ్రామస్తులతో మమేకమై భద్రతపై అవగాహన కల్పించారు. కాలినడకన గ్రామంలో పర్యటిస్తూ ప్రజలు, మహిళల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ మహిళలతో కలిసి భోజనం చేశారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తొగుట సీఐ షేక్ లతీఫ్ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేపట్టగా, గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు పోలీసులు తెలిపారు. ‘సురక్ష నేత్ర’లో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పై ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, ఎంపిక చేసిన గ్రామాలను సురక్షిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు.