గజ్వేల్, డిసెంబర్ 13 : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాస్టర్ ప్లాస్ సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత కొద్ది నెలలుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ను అధికారులు సిద్ధం చేస్తుండగా నేటికి పూర్తయ్యింది. పూర్తయిన మాస్టర్ప్లాన్ను పట్టణాభివృద్ధి శాఖకు పంపడానికి గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం మంగళవారం ప్రత్యేక సమావేశంలో తీర్మానించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ సహకారంతో 2041 సంవత్సరం వరకు మున్సిపాలిటీ పరిధిలో పెరిగే జనాభా, విస్తరించే కాలనీలు, నివాసగృహాలు, కొత్త రహదారులు, పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కాంప్లెక్సులు ఇతర అవసరాల పట్టణ విస్తరణ కోసం జోన్లను విభజిస్తూ ప్రణాళికలను సిద్ధం చేశారు. పట్టణాభివృద్ధి ప్రణాళిక సంఘం ఆమోదం పొందితే ప్రభుత్వ జీవో విడుదల అవగానే ఈ మాస్టర్ ప్లాన్ కార్యచరణలోకి వస్తుంది. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోద్దీన్, కమిషనర్ విద్యాధర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు,అధికారులు పాల్గొన్నారు.