రాయపోల్, సెప్టెంబర్ 08: యూరియా (Urea) కోసం రైతన్నకు ప్రతిరోజు కష్టాలు తప్పడం లేదు. గత మూడు రోజుల నుంచి యూరియా లేకపోవడంతో వివిధ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం తెల్లవారుజాము నుంచి సిద్దిపేట జిల్లా రాయపోల్ (Raipole) మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రం వద్ద అర కిలోమీటర్ క్యూలైన్ ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో నిలుచోని తిండి తిప్పలు లేక కనీసం ఛాయ్ తాగేందుకు కూడా వీలు కాకపోవడంతో రైతుల చెప్పులు, రాళ్లు, కర్రలను క్యూ లైన్లో ఉంచగడం పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. వ్యవసాయ అధికారులు వచ్చి సమాధానం చెప్పాల్సింది పోయి ఇటువైపు తొంగి చూడకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని యూరియా ఇవ్వడంతో తమ పంటలను కాపాడుకునేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఒకరికి ఒకే బస్తా ఇవ్వడంతో ఆందోళన చెందిన రైతులు వారి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని క్యూ లైన్లో ఉంచుతున్నారు. అలాగే మహిళలు సైతం దారి పొడుగునా క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండడంతో వారు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూరియా ఎప్పుడు వస్తుందని ఫోన్ ద్వారా సంబంధిత వ్యవసాయ అధికారులకు చేసిన వారు పట్టించుకోవడంలేదన్నారు. ఒకవైపు రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రులు ప్రకటిస్తున్నప్పటికీ.. తమకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే బస్తా యూరియా కోసం క్యూ లైన్లో గంటలు తరబడి ఉంటే తమ పనులు చేసేది ఎవరని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఈ విషయంలో తక్షణమే స్పందించి సరిపడా యూరియాను అందించాలని, లేనిపక్షంలో రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
మూడు రోజులు గడుస్తున్నా అందని యూరియా
మండల కేంద్రంలో గత మూడు రోజుల నుంచి యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ప్రభుత్వం యూరియా కొరతలేదని ప్రకటిస్తున్నప్పటికీ ఎటు పోతున్నదని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటలు పోట్టకు వచ్చే దశలో యూరియా వేయకపోతే దిగుబడి రాదని పేర్కొంటున్నారు. 10 ఎకరాలు ఉన్నప్పటికీ కేవలం ఒకే బస్తా యూరియా ఇవ్వడం గత పదేండ్ల కాలంలో ఎప్పుడూ చూడలేదన్నారు.