మద్దూరు (ధూళిమిట్ట) : సిద్దిపేట జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ టూరిజం క్లబ్ జిల్లా స్థాయి పోటీల్లో ధూళిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్భుత ప్రదర్శనతో మూడవ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైందని మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 78 పాఠశాలలు పాల్గొన్న ఈ పోటీల్లో మూడవ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
దీనికి కృషిచేసిన యువ టూరిజం క్లబ్ గైడ్ టీచర్లను విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. మన స్థానిక చరిత్ర, వారసత్వం, కలలు మరుగున పడిపోయిన పర్యటక ప్రదేశాలను వెలికి తీసి పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం వల్లే ఈ స్థానం లభించిందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాఠశాల అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.