చేర్యాల, జూన్ 11: కాంగ్రెస్ సర్కారు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని బదిలీలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండడంతో కొమురవెల్లి మల్లన్న ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగుల్లో బదిలీల గుబులు మొదలైంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయం, భద్రాచలం సీతారామ స్వామి వారి ఆలయం, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్ తదితర ఆలయాలకు చెందిన అధికారులు, సిబ్బందిని బదిలీ చేసేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఇటీవల మంత్రి కొండా సురేఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్ణయించారు. దీంతో కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయానికి చెం దిన ఉద్యోగులకు బదిలీలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా ఒకేచోట పనిచేయడంతో అవినీతి, అక్రమాల ఆరోపణలను కొందరు ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆలయాల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేస్తే అవినీతి, అక్రమాలను రూపుమాపవచ్చని సర్కారు బదిలీల ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 13 ఏండ్ల క్రితం ఉమ్మడి ఏపీ పాలనలో ఉన్న సమయంలో కొమురవెల్లి ఆలయం నుంచి యాదాద్రి, వేములవాడ, కొండగట్టు, భద్రాచలం, బాసర తదితర ఆలయాలకు ఉద్యోగులు బదిలీపై వెళ్లారు. అక్కడ విధులు నిర్వహించిన ఉద్యోగులు ఇక్కడికి వచ్చారు.13 ఏండ్ల క్రితం జరిగిన బదిలీలు తప్ప మరోసారి ట్రాన్స్పర్లు లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నట్లు ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
29 ఏండ్లుగా ఇక్కడే ఉద్యోగం..
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి నేటివరకు కొందరు ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో 18 మంది ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో 29 ఏండ్ల నుంచి మొదలు కుని 25, 23, 21,11 సంవత్సరాలు కొందరు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఏఈవోలు, జూనియర్, రికార్డు అసిస్టెంట్లతోపాటు సిబ్బంది బదిలీలు తప్పవని స్థానికంగా చర్చ జరుగుతున్నది.
దేవాదాయ శాఖ కార్యాలయానికి జాబితా..
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఏండ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జాబితాతోపాటు ఆలయం లో పనిచేస్తున్న పూర్తి స్థాయి ఉద్యోగులు, సిబ్బంది జాబితాను దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యాలయానికి ఇటీవల చేరినట్లు విశ్వసనీయ సమాచారం. జాబితా వెళ్లిన విషయం తెలుసుకున్న పలువురు ఉద్యోగులు, సిబ్బంది జాబితాలో తన పేరు ఉందా, ఉంటే ఏ ఆలయానికి ట్రాన్స్పర్పై వెళ్లాల్సి వస్తుందోనని గుబులులో ఉన్నారు. ఇక్కడే ఉద్యోగ విరమణ జరిగితే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.