ములుగు, మే 18 : మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉద్యాన సాగులో నూతన వంగడాలకు శ్రీకారం చుట్టాలని ఉద్యాన శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి అన్నా రు. శనివారం ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో పరిశోధన, విస్తరణ, సలహామండలి సమావేశం నిర్వహించి విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధన, విస్తరణ ఫలితాలను విశ్లేషించి వచ్చే సంవత్సరానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉద్యాన శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ… ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరించి వర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను మరింతగా విస్తరించాలని సూచించారు. ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకొని పంటలు పండేలా నూతన వంగడాలను సృష్టించాలన్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలతో రైతులకు రెట్టింపు ఆదాయం అందుతుందన్నారు. ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు ప్రొత్సాహాలను అందిస్తూ సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం రూపొందించిన ఉద్యాన పంటల సాగు సమాచార బ్రోచర్‌ను వర్సిటీ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ నీరజాప్రభాకర్, రిజిస్ట్రార్ డాక్టర్ భగవాన్, ఆయా జిల్లాల ఉద్యానశాఖ అధికారులు, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, పలువురు ఆదర్శ రైతులు పాల్గొన్నారు.