చేర్యాల, ఫిబ్రవరి 18: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఐదో వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ పూర్వపు జిల్లాల నుంచి సుమారు 30వేల మందికి పైగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మల్లన్న నామస్మరణతో ఆలయం మార్మోగింది. శనివారం రాత్రి నుంచే మొదలైన భక్తుల రాక ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి క్యూ ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్,ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఒగ్గు పూజారులు, సిబ్బంది విధులు నిర్వర్తించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
ఇటీవల వీఐపీ పాస్‌లను కొందరు పక్కదారి పట్టించిన విషయం వెలుగుచూడడంతో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆలయవర్గాలు వీఐపీ పాస్‌ల జారీని కఠినతరం చేశాయి. వీఐపీ పాస్‌ల జారీ కేంద్రం వద్ద ఆదివారం సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై నాగరాజుతో కలిసి ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి రికార్డులను పరిశీలించారు. ప్రతి ఆదివారం పాస్‌ల జారీ చేస్తూ నమోదు చేస్తున్న వివరాలను సీఐ అడిగి తెలుసుకున్నారు. పాస్‌ల జారీ విషయంలో ఆలయ అధికారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.