భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర
వివిధ రాష్ర్టాల నుంచి వచ్చి జీవనోపాధి
ప్రతి ఇంటి నిర్మాణంలోనూ వారే..
ఇతర రంగాల్లో సైతం నైపుణ్యత
ఏటా 50 వేల మంది పనిచేస్తున్నట్లు అంచనా
అమీన్పూర్, మార్చి 1 : నిర్మాణ రంగంతోపాటు వ్యా పార సంస్థలు మనుగడ సాగించాలంటే కార్మికుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. అభివృద్ధిలో దూసుకుపోతున్న పట్టణాలు, నగరాల వెనుక కార్మికుల పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు. ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ కార్మికుల కృషి కావాల్సిందే. కార్మికుల పాత్ర లేకుండా ఏ పని ముందుకు సాగదు. కాగా, హైదరాబాద్ నగరానికి పరిసర ప్రాంతమైన అమీన్పూర్ అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది. గతంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు పూర్తి స్థాయిలో పని దొరక్క ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. కానీ, ప్రస్తుతం దేశంలోనే అన్ని రాష్ర్టాల చెందిన కార్మికులు అమీపూర్‌లో ఉపాధి పొందుతున్నారు.
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న అమీన్పూర్..
నిర్మాణ రంగంలోనే కాకుండా వ్యాపార, వాణిజ్య రం గాల్లోనూ అమీన్పూర్ దూసుకుపోతున్నది. వివిధ రం గాల్లో పని చేసే కార్మికులు అమీన్‌పూర్‌కు వలసలు వచ్చి ఉపాధి పొందుతున్నారు. అమీన్పూర్ మున్సిపల్, మం డల పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న నిర్మాణ రంగం లో 90 శాతం కార్మికులు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చివారే. బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి అనేక రాష్ర్టాల ప్రజలు ఇక్కడికి వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. అంతేకాకుండా వివిధ పరిశ్రమల్లోనూ వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. భవన నిర్మాణ వ్యాపారులు, సొంత ఇంటి యజమానులు పూర్తిగా వలస కార్మికులపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఒక్కో రంగంలో ప్రత్యేకమైన కార్మికులు..
భవన నిర్మాణంలో గ్రానైట్ వేయడానికి రాజస్థాన్ కార్మికులు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వుడ్ వర్క్, పెయింటింగ్ వేయడంలో ఉత్తరప్రదేశ్ కార్మికులు, కట్టడాల్లో ఆంధ్రప్రదేశ్ కార్మికులు, మట్టి పనులు చేయడానికి బీహార్ కార్మికులు, ఇటుకలు తయారు చేయడంలో మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, తమిళనాడు కార్మికులు నిష్ణాతులుగా పేరుపొందారు. ఈ విధంగా ఒక్కో రంగంలో.. ఒక్కో ప్రత్యేకమైన నైపుణ్యత కలిగి ఉండి అమీన్పూర్ ప్రాంతానికి వచ్చి ఉపాధి పొందుతున్నారు.
50 వేల మందికి పైగా కార్మికులు..భవన నిర్మాణ రంగంలో సుమారు 50 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్టు భవన నిర్మాణ కార్మిక అసోసియేషన్ లెక్కలు చెబుతుంది. గతంలో ఇక్కడి కార్మికులకు పని దొరక్క ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నా యి. అమీన్పూర్ దినదినాభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ కార్మికులు కొరత చాలా ఎక్కువే ఉందని చెబుతున్నారు. నిర్మాణ రంగ యజమానులు ఏటా ఇతర రాష్ర్టాలకు వెళ్లి పనిచేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకొని కార్మికులను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే అమీన్పూర్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నట్టు తెలుస్తున్నది.
వలస కార్మికులతోనే భవన నిర్మాణాలు
అమీన్పూర్ ప్రాంతంలో 15 ఏండ్ల నుంచి బిల్డర్‌గా పని చేస్తున్నా. అనేక నిర్మాణాలను చేపట్టాం. భవనాలను నిర్మించాలంటే వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులను రప్పిస్తాం. వలస కార్మికులతోనే నిర్మాణ పను లు సకాలంలో పూర్తి చేస్తాం. పనుల్లో నాణ్యత, నైపుణ్యత ఉం టుంది. కార్మికులు రాత్రి, పగలు శ్రమించి పనిని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
– మహేందర్‌రెడ్డి, బిల్డర్, అమీన్పూర్
అమీన్పూర్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ..
అమీన్పూర్ ప్రాంతంలో పనులు ఎక్కువగా లభిస్తున్నాయి. ఇక్కడ ఇండ్ల నిర్మాణాలు చాలా కొనసాగుతున్నా యి. నాతోపాటు మా రాష్ట్రం నుంచి చాలా మంది కార్మికులు ఇక్కడే పని చేస్తున్నారు. ఇక్కడ తమకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మేం టైల్స్, గ్రానైట్ వర్క్ చేస్తుంటాం. మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్మాణదారులకు నచ్చినట్లు పనిచేస్తాం.
– సర్వన్‌సింగ్, కార్మికుడు, ఉత్తరప్రదేశ్
వలస కార్మికులకు భద్రత కల్పిస్తాం..
అమీన్పూర్ మండల పరిధిలో వేలాది మంది వలస కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. కార్మికులను అండగా నిలిచి భద్రత కల్పిస్తున్నాం. అనేక ప్రాంతాల నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి పనులు చేయడంతో అమీన్పూర్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కరోనా సమయంలో వలస కార్మికులను ఆదుకున్నాం. ఇకముందు కూడా కార్మికులను ఆదుకుంటాం.
– దేవానంద్, ఎంపీపీ