సిద్దిపేట అర్బన్, మార్చి 2: తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చిన సిద్దిపేట జిల్లా గురించి సమగ్ర పుస్తకం తేవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గురువారం ‘సిద్దిపేట సమగ్ర స్వరూపం’గ్రంథావిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డితో కలిసి మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర ఆకాంక్షను, మూడు దశాబ్దాల సిద్దిపేట జిల్లా కలను నిజం చేసింది ఈ ప్రాంత ముద్దుబిడ్డ కేసీఆర్ అన్నారు.
రానే రాదనుకున్న తెలంగాణను సాధించిన నాయకుడు ఇక్కడి మట్టి బిడ్డ కావడం మనందరి అదృష్టమన్నారు. చిన్న జిల్లాలు చేసి పాలన చేరువ చేసిన గొప్ప పాలనాదక్షుడు సీఎం కేసీఆర్ అని, నాడు సంగారెడ్డి జిల్లా కేంద్రం ఉన్నప్పుడు పడిన బాధలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సిద్దిపేట ప్రజలు చాలా గొప్పవాళ్లని, తొలిదశ ఉద్యమంలో మొదటి ఉప ఎన్నిక సిద్దిపేటలోనే జరిగిందని, నాటి పాలకులు ఉద్యమాన్ని తొక్కి పెట్టాలని చూస్తే విజ్ఞులైన సిద్దిపేట ప్రజలు నాడు మదన్మోహన్ను గెలిపించి ఉద్యమాన్ని నిలబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ మూడు పదవులకు రాజీనామా చేస్తే, సమైక్య పాలకులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది సిద్దిపేట ప్రజలే అన్నారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఈ ప్రాంతం చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందిందన్నారు. సిద్దిపేట మట్టిలోనే పరిమళం, గొప్పతనం ఉందన్నారు. ఈ ప్రాంతం నుంచి ఏ నాయకుడు ఉన్నా, సేవాభావంతోనే పని చేశారన్నారు. సాహిత్యం, జానపదం, కళలు, అన్ని రంగాల్లో జిల్లా అగ్రగామిగా ఉందన్నారు.
ఈ ప్రాంతంలో నాడు తాగడానికి నీళ్లు ఉండేవి కావని, నేడు రిజర్వాయర్ల ఖిల్లాగా మారిన విషయాన్ని చూస్తున్నామన్నారు. కాళేశ్వరం రిజర్వాయర్‌కు గుండెకాయ లాంటి మల్లన్నసాగర్ సిద్దిపేటలోనే ఉండడం మనకు గర్వకారణం అని మంత్రి హరీశ్‌రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంత రూపురేఖలు చాలా మారిపోయాయని, సీఎం కేసీఆర్ చెప్పినట్టు సిద్దిపేటకు అన్నీ వచ్చాయని, ఒక్క విమానం రావడమే తక్కువగా ఉందన్నారు. 1969 ఉద్యమం నుంచి ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా, ప్రతి ఎన్నికలో ఉద్యమ భావాన్ని చాటి చెప్పిన గొప్పతనం ఈ ప్రాంత ప్రజలది అని మంత్రి అభినందించారు. రాష్ర్టానికి ఒక దిక్సూచి సిద్దిపేట అని, భావిపౌరులకు ఈ ప్రాంత చరిత్రను అందించడం చాలా అవసరమన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ చేసిన మంచి ప్రయత్నానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
పదో సమగ్ర స్వరూపం ఇది..
ఈ సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్తు సభ్యుడు జుర్రు చెన్నయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టానికి సిద్దిపేట ఒక నమూనాగా ఉందని, తెలంగాణ ఉద్యమంలో జరిగిన కొన్ని ఘట్టాలను ఈ సిద్దిపేట సమగ్ర స్వరూపం గ్రంథంలో పొందుపర్చినట్లు తెలిపారు. ఇప్పటికే 9 జిల్లాల సమగ్ర స్వరూపం తీసుకొచ్చామని, సిద్దిపేట జిల్లా సమగ్ర స్వరూపం పదోది అన్నారు.
40 అంశాలతో పుస్తకం రూపకల్పన
ఈ సందర్భంగా కోర్ కమిటీ కన్వీనర్ కొండి మల్లారెడ్డి మాట్లాడుతూ.. 40 అంశాలను ప్రాతిపాదికగా తీసుకొని ఈ పుస్తకాన్ని రచించామన్నారు. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.
ఇలాంటి ఆవిష్కరణలు ప్రేరణగా నిలవాలి
ఎంతో విశిష్టత కలిగిన సిద్దిపేట సమగ్ర స్వరూపం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని సారస్వత పరిషత్తు చేపట్టడం చాలా సంతోషమని రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. నిజాం రాజ్యంలో తెలుగును అణచివేసినప్పుడు నాడు సారస్వత పరిషత్తు ఏర్పాటు అయ్యిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన సిద్దిపేట గురించి పుస్తకం రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఎంతో సంయమనంతో ఈ పుస్తకాన్ని ప్రచురించిన తెలంగాణ సారస్వత పరిషత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇది మరిన్ని ఆవిష్కరణలకు నాందిగా, ఆదర్శంగా ఉంటుందని సిధారెడ్డి అన్నారు.
– నందిని సిధారెడ్డి, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్
వ్యక్తిత్వాన్ని నేర్పిన గడ్డ ..
తాను గత 50 ఏండ్ల నుంచి ప్రభుత్వ సర్వీస్‌లో ఉండడానికి కారణం సిద్దిపేట మాత్రమే అని కేవీ రమణాచారి అన్నారు. తనకు మంచి వ్యక్తిత్వాన్ని అందించిన విద్యాలయం సిద్దిపేట కళాశాల అన్నారు. నాడు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న రోజులు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజునే తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించారని, అది సిద్దిపేట ఇచ్చిన గొప్పతమన్నారు. ఈ జిల్లా సమగ్ర స్వరూపాన్ని అందిస్తున్న తెలంగాణ సారస్వత పరిషత్తుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సారస్వత పరిషత్తుకు 80 ఏండ్ల గొప్ప చరిత్ర ఉందన్నారు. ఎన్ని భాషలు ఉన్నా.. తెలుగు భాష ఎప్పటికీ గొప్పదని, మనకు ఆ భాష ఎప్పటికీ అవసరం ఉంటుందన్నారు.
– కేవీ రమణాచారి, ప్రభుత్వ సలహాదారు
సారస్వత పరిషత్తుకు ఘన చరిత్ర ..
తెలంగాణ సారస్వత పరిషత్తుకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, దాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డపై ఉందని సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి దేశపతి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల ద్వారా ఎంతో మందికి సాంస్కృతిక చైతన్యం వెల్లి విరిసిందన్నారు. సిద్దిపేటలో అమోఘమైన చైతన్యం ఉందని తెలిపారు. తెలంగాణ భాష పటిమను ఆవాహనం చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని, అది సిద్దిపేట ఇచ్చిన చైతన్యమే అన్నారు.
– దేశపతి శ్రీనివాస్, సీఎం కార్యాలయ ఓఎస్డీ