సిద్దిపేట, అక్టోబర్ 26: వినూత్నమైన కార్యక్రమాల అమలుతో సిద్దిపేట మున్సిపాలిటీ అధ్యయన కేంద్రంగా మారిందని మున్సిపల్ కమిషనర్ల బృందం ప్రశంసించింది. పర్యటనలో భాగంగా శనవారం మూడోరోజు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, రాయికల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ సంపత్, ధర్మపురి మున్సిపల్ కమిషనర్ గంగాధర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రాజేందర్‌కుమార్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రాజు, మెట్పల్లి డీఈ నాగేశ్వరరావు, కోరుట్ల ఎంఏఈ అరుణ్‌కుమార్ సిద్దిపేట పట్టణంలోని 25వ వార్డులో పర్యటించి చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేసే విధానాన్ని పరిశీలించారు.
వనమహోత్సవంలో భాగంగా మొకలను నాటారు. బుస్సాపూర్‌లోని రిసోర్స్ పార్కును సందర్శించి తడి చెత్తతో బయోగ్యాస్ తయారీ, బయోమైనింగ్ ఇన్సినరేటర్ నిర్వాహణను పరిశీలించారు. ఐటీసీవావ్ఈ ఫౌండేషన్ పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని సందర్శించి చెత్తను వేరు చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్వచ్ఛబడిలో సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి అమలు తీరును మున్సిపల్ కమిషనర్లకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్ వివరించారు. కౌన్సిలర్లు యోగేశ్వర్, దీప్తినాగరాజు, డాక్టర్ డీఎన్ స్వామి, సెంటర్ ఇన్స్పెక్టర్ వనిత పాల్గొన్నారు.