కొండపాక, జూలై 4: సత్యసాయి సంజీవని దవాఖానలో చికిత్స పొందిన చిన్నారులు మృత్యుంజయులు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవని దవాఖానలో ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమానికి సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. మళ్లీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన వైద్యులకు, చిన్నారులు, వారి తల్లిదండ్రులకు, వైద్యబృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సత్యసాయి దవాఖాన చైర్మన్ శ్రీనివాస్ గురించి పొగడటం కాదు, ఆయన కనిపించే దేవుడన్నారు. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.
ప్రతి సంవత్సరం సత్యసాయి దవాఖానల్లో సుమారు 6000 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు, వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. చిన్న పిల్లలకు చికిత్స అందిస్తూ వారికి మళ్లీ జీవితాన్ని ప్రసాదించడం సాధారణ విషయం కాదన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సేవా కార్యక్రమాల కోసమే తన సమయాన్ని వెచ్చిస్తున్నారన్నారు. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అనే మాటను ఆచరణలో పెడుతూ, సొంత డబ్బులు ఖర్చు చేస్తూ, ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా దవాఖానను సక్సెస్‌గా నడిపిస్తున్నారన్నారు. సత్యసాయి సంజీవని దవాఖాన కేవలం ఒక దవాఖాన మాత్రమే కాదని వేలాది కుటుంబాలకు ఒక దేవాలయం లాంటిదన్నారు. ఇప్పటి వరకు కొండపాకలోని సత్యసాయి సంజీవని దవాఖానలో 500 మంది చిన్నారులకు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేయడం సంతోషకరమన్నారు.
సాధారణంగా విజయం వచ్చిన తర్వాత కొందరిలో గర్వం ఉంటుంది కానీ సినీ హీరో విజయ్ దేవరకొండలో అలాంటిది లేదన్నారు. కరోనా సమయంలో వేలాది మందికి ఆయన అండగా నిలిచారని కొనియాడారు. సత్యసాయిలోనే చదువుకున్న ఆయన సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారన్నారు. సత్యసాయి సంజీవని దవాఖానకు అందిసున్న సహకారం మరువలేనిదన్నారు. సత్యసాయి దవాఖాన సిద్దిపేట గడ్డపై ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. ఏడాది వేతనం దవాఖానకు ఇస్తున్నట్లు ప్రకటించారు. సేవలు మరింత విస్తరించాలని, ఇంకా వేలాది మంది చిన్నారులకు జీవం పోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.
సిద్దిపేట ప్రాంతానికి పెద్ద నాయకుడిగా, మంత్రిగా ఎన్నో సేవలు అందించిన హరీశ్‌రావు సిద్దిపేట షేర్‌ఖాన్ అని, ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు సినీ హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. సత్యసాయి సంజీవన దవాఖాన నిర్మాణం కోసం హరీశ్‌రావు సహకరించారని కొనియాడారు. హరీశ్‌రావు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఎంతోమంది చిన్నారులు ప్రాణాలతో జీవనం కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. దేశం మొత్తంలో 10 సత్యసాయి దవాఖానలు ఉండగా అందులో కొన్ని వేలమంది చిన్నారులకు జీవం పోస్తున్న సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.