సిద్దిపేట టౌన్, డిసెంబర్ 13 : ఆర్మీ జవాన్ అదృశ్య ఘటనను ఛేదిస్తామని సిద్దిపేట అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. జవాన్ కేసు దర్యాప్తునకు సంబంధించిన పురోగతి, తీసుకుంటున్న చర్యలపై సోమవారం సిద్దిపేట పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బుకూరి విజయ-పటేల్‌రెడ్డి దంపతుల రెండో కొడుకు, ఆర్మీ జవాన్ సాయికిరణ్‌రెడ్డి(21) ఇటీవల శిక్షణ పూర్తి చేసుకొని, పంజాబ్‌లోని ఫరీద్ కోట్లో విధుల్లో చేరాడు. నవంబర్ 16న సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి విధుల్లో చేరేందుకు ఈ నెల 5న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానమెక్కి, కుటుంబీకులతో వీడియో కాల్లో చివరి సారిగా మాట్లాడారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగి ఫరీద్ కోట్కు వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాడు. తిరిగి అతనికి కుటుంబీకులు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. అదే సమయంలో ఫరీద్ కోట్ నుంచి కెప్టెన్ సాయికిరణ్ తండ్రికి ఫోన్ చేసి, అతను డ్యూటీలో చేరలేదనే విషయాన్ని చెప్పాడు. ఈ మేరకు జవాన్ తండ్రి పటేల్‌రెడ్డి చేర్యాల పోలీసు స్టేషన్లో ఈ నెల 8న ఫిర్యాదు చేశాడు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.
పోలీసులు ఈ కేసును ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. ఢిల్లీ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా, ఎయిర్‌పోర్టు టెర్మినల్ నుంచి అర్ధరాత్రి సాయికిరణ్‌రెడ్డి బయటకు వెళ్తున్నట్లు కనిపించారన్నారు. లోకల్ ట్రైన్లో వెళ్లే సమయంలో స్థానికంగా ఉండే డాక్టర్ మనీష్‌తో పాటు మరో జవాన్ సాయికిరణ్‌రెడ్డితో కలిసి ప్రయాణం చేసినట్లు కెమెరాల్లో నిక్షిప్తమైందని పేర్కొన్నారు. ఆ దిశగా విచారణ జరిపామని తెలిపారు. డాక్టర్ మనీష్‌తో కూడా మాట్లాడామన్నారు. బత్ ఇం డియా వద్ద మనీష్, మరో జవాన్ దిగిపోయారని తెలిపారు. చివరిసారిగా సాయికిరణ్‌రెడ్డి ఫోన్ హర్యానాలోని జకాన్ వద్ద లొకేషన్ లోకెట్ అయిందన్నారు. ఆర్మీ జవాన్ కేసు త్వరితగతిన ఛేదించేందుకు మంత్రి హరీశ్‌రావు, సీపీ జోయల్ డెవిస్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారన్నారు. అందుకు గాను సిద్దిపేట పోలీసు కమిషనరేట్ నుంచి ప్రత్యేక టీంను ఢిల్లీకి పంపామని చెప్పారు. ప్రత్యేక టీమ్ సెల్ టవర్ లొకేషన్, సీసీ కెమెరాల ఆధారంగా ఢిల్లీ పోలీసులతో కలిసి కేసు ఛేదించేందుకు తమవంతు చర్యలను తీసుకుంటుందన్నారు. త్వరలోనే కేసు ఛేదిస్తామని డీసీపీ చెప్పారు. కార్యక్రమంలో చేర్యాల సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేందర్‌రెడ్డి ఉన్నారు.