విద్య, వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరు మండలంలోని సలాఖపూర్‌లో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
మనఊరు-మనబడితో మౌలిక వసతుల కల్పన
తెలంగాణ ప్రజల నెత్తురు తాగుతున్న కేంద్రం
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
మద్దూరు (ధూళిమిట్ట), మే 31 : విద్య, వైద్యరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరు మండలంలోని సలాఖపూర్‌లో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వంగ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో మౌలిక వసతులు సమకూరనున్న ట్లు తెలిపారు. మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో సుమారు రూ.5 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఒకనాడు కరువు కాటకాలతో తినడానికే తిండికి ఇబ్బంది పడిన తెలంగాణ నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు.
రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ చిల్లర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సంపదను కేంద్రం దోచుకొనిపోయి ఉత్తరాది రాష్ర్టాల్లో ఖర్చు చేస్తుందన్నారు. ప్రజల నెత్తురు తాగుతున్న కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడంలో విఫలమైందన్నారు. రానున్న రోజుల్లో వెనుకబడిన అన్ని కులాలకు దళితబంధు తరహాలో ఆర్థికంగా చేయూతనందించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదన్నారు. సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతుందని, సర్కారు దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎవెన్యూ ప్లాంటేషన్‌పై అధికారులు శ్రద్ధవహించాలన్నారు. మొక్కలు నాటడం, మొక్కలకు పాదులు చేయడం గురించి అధికారులకు ఎమ్మెల్యే డెమో ఇచ్చారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు సంతోశ్‌కుమార్, మంద యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ ఇర్రి రాజేశ్వర్‌రెడ్డి ఎంఈవో నర్సింహారెడ్డి, పీఆర్ ఏఈ వినయ్‌కుమార్, ఉపసర్పంచ్ తాళ్లపల్లి శ్రీధర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.