బెజ్జంకి, మే 31: సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ రైతు. వరి పంటతో ప్రయోజనం లేదని గ్రహించి ఇతర పంటలు సాగు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన తుమ్మ మర్రిరెడ్డి అనే రైతుకు గ్రామ శివారులో ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి, రెండు బోర్లు ఉన్నాయి. వ్యవసాయ భూమిలో సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు సాగుచేయాలని ఆలోచించాడు. వివిధ రకాల పంటలను పరిశీలించి, శాస్త్రవేత్తలను కలిసి సలహాలు తీసుకున్నాడు. ఎకరంలో జామ, మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాడు.
వాణిజ్య పంటలపై దృష్టిపెట్టాలి
రైతులు వరి పంటలాంటి సంప్రదాయ పంటలు సాగుచేయొద్దు. పండ్లు, వాణిజ్య పంటలపై దృష్టిపెట్టాలి. జామ, బొప్పాయి, మక్క పంటలు సాగు చేస్తున్నా. మార్కెట్లో మంచి ధర పలికి, తక్కువ నీటి లభ్యత, ఎక్కువ దిగుబడి వచ్చే పంటలను సాగు చేయాలి.
-తుమ్మ మర్రిరెడ్డి, రైతు, లక్ష్మీపూర్
తోటల సాగుతో ఆదాయం
సాధారణ పంటల కంటే తోటల సాగు రైతులకు లాభదాయకమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సాధారణ జామతోట కంటే తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే తైవాన్ జామ గురించి తెలుసుకున్న మర్రిరెడ్డి హైదరాబాద్లో సంవత్సరం క్రితం 500 మొక్కలను కొనుగోలు చేసి తన వ్యవసాయ భూమిలో నాటాడు. వాటికి డ్రిప్ అనుసంధానం చేశాడు. నాటిన కొన్ని రోజుల్లో పిందెలు రావడంతో మొక్కలు పెరగడం కోసం వాటిని తెంపివేశాడు. మొక్కలు ఏపు గా పెరిగాయి. నాలుగు టన్నుల జామ పండ్లను నాలుగు నెలల కిత్రం విక్రయించాడు. తక్కువ నిర్వహణ ఖర్చు రాగా, టన్నుకు రూ. 50 వేల వరకు లాభం వచ్చింది. సంవత్సరానికి జామ పండ్ల ద్వారా లక్ష ఆదాయం సమకూరింది. 500 మొక్కలు నాటేందుకు రూ.50 వేల వరకు ఖర్చుకాగా, ఏడాదికి లక్ష ఆదాయం వస్తున్నది. మొక్కల సంరక్షణ కోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా నెలకు ఆరు వేలు, ఎరువులకు సుమారుగా సంవత్సరానికి లక్ష రూపాయల ప్రోత్సాహం అందిస్తున్నది. బొప్పాయి మూడు ఎకరాల్లో సాగు చేయగా ఇంటి దగ్గర నర్సరీ ఏర్పాటు చేసి 3500 మొక్కలు పెంచి నాటినట్లు మర్రిరెడ్డి తెలిపాడు. జూలైలో మొదటి పంట చేతికిరానున్నదని, సాగు కోసం ఇప్పటి వరకు రూ. 60 వేల ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు.