చేర్యాల, నవంబర్ 2: అధికారుల తీరుతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ఖజానాకు ఆదాయం గండిపడుతున్నది. కొమురవెల్లి మల్లన్న ఆలయంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద టెంకాయల విక్రయానికి తక్కువ ధరకు టెండర్ పాడడంతో ఇటీవల దేవాదాయశాఖ కమిషనర్ ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ టెండర్‌ను తక్కువ ధరకు పాడిన వారే ప్రస్తుతం ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయిస్తుండడంతో ఆలయ ఆదాయానికి నష్టం చేకూరుతున్నది. మల్లన్న ఆలయానికి సంబంధించి కొబ్బరికాయల విక్రయం, తలనీలాల సేకరణ, స్వామి వారికి భక్తులు సమర్పించే కొబ్బరికాయల ముక్కల సేకరణతోపాటు ఆదాయా న్ని తెచ్చిపెట్టే వాటికి ఏటా ఆలయ అధికారులు టెండర్లు నిర్వహిస్తారు.
టెండర్ ఎక్కువ ధరకు పాడిన వారికి లేదా సంస్థలకు హక్కులు అప్పగిస్తారు. ఈసారి టెండర్లో ఎల్లమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే టెండర్‌తో పాటు తలనీలాల సేకరణ టెండర్లకు ఆలయవర్గాలు ఆశించిన స్థాయిలో టెండరుదారులు పాట పాడలేదు. గతేడాది నిర్వహించిన టెండర్లో రూ.20లక్షల మేరకు పాటను పాడి హక్కులు పొందారు. ఈసారి నిర్వహించిన టెండరులో కొందరు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడడంతో కేవలం రూ.12లక్షలు మాత్రమే టెండరు పాట పాడారు దీంతో రెండు టెండర్లు దేవాదాయశాఖ కమిషనర్ రద్దు చేశారు.
ఆలయానికి సంబంధించిన నిర్వహించిన టెండర్లు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. కానీ, తలనీలాలు, గుట్టపైన ఉన్న ఎల్లమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయల విక్రయ టెండర్లు మాత్రం ఖరారు కాలేదు. దీంతో ఆలయ అధికారులు స్వామి వారికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న తలనీలాలను సేకరించి భద్రపరిచి ఇటీవల రాష్ట్ర దేవాదాయశాఖ కార్యాలయంలో జరిగిన టెండర్లలో కిలోకు రూ.8100 చొప్పును కొనుగోలు చేసేందుకు ఓ వ్యాపారి ముందుకు రావడంతో ఆయనకు లైసెన్స్ హక్కులను అప్పగించారు.
ఇదే పద్ధ్దతిని కొబ్బరికాయలు విక్రయం టెండరు ఖరారు చేస్తే ఆలయానికి ఆదాయం సమకూరేది. ఆలయ ఈవో మళ్లీ టెండరు నిర్వహించినా ఎవరూ ముందుకు రాలేదని తక్కువ ధరకు టెండరు పాడిన వారికి కొబ్బరికాయల విక్రయ హక్కులు కల్పించాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు నివేదించారు. దీనిని కమిషనర్ తిరస్కరించారు. మరోసారి టెండరు నిర్వహించాలని ఆదేశించారు. కానీ, ఆలయ అధికారులు టెండరు ముగిసిన తేదీ నుంచి ఇప్పటి వరకు మరో టెండరు నిర్వహించలేదు. దీంతో ఎల్లమ్మ ఆలయం వద్ద ఇష్టారాజ్యంగా కొబ్బరికాయలను టెండరు ఖరారు కాని వ్యక్తులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఆలయ ఆదాయం పెంచేందుకు కృషి చేయాల్సిన అధికారులు కిమ్మనకుండా ఉండడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎల్లమ్మ ఆలయం వద్ద రూ.40,రూ.50వరకు కొబ్బరికాయలు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆలయ ఈవో బాలాజీని ఫోన్లో వివరణ కోరగా.. తక్కువ ధరకు టెండరుపాడిన వ్యక్తి రూ.10లక్షలు చెల్లించాడని, టెండరు పాటపాడిన రోజు నుంచి ఇప్పటి వరకు కొబ్బరికాయలు విక్రయిస్తున్న వ్యక్తి నుంచి ప్రతినెలా రూ.లక్ష చొప్పున వసూలు చేస్తామని తెలిపారు.