సిద్దిపేట, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట జిల్లాకు పైసా నిధులు రాలేదు.. తట్టెడు మట్టితీసి అభివృద్ధి పనులు చేయలేదు. రెండేండ్ల పాలనలో తాము అద్భుతాలు చేశామని రేవంత్‌రెడ్డి సర్కారు విజయోత్సవాలు జరుపుకొంటుంది.నేడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసే సభకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరవుతున్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆర్భాటాలు, హంగులు తప్పా జిల్లా ప్రజలకు కాంగ్రెస్ సర్కారు చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు.
శిలా ఫలకాలు, శంకుస్థాపనలు తప్పా ఒక్క పని పురోగతి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రైతులు ఎరువులు, విత్తనాలు సకాలంలో లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సన్నాల బోనస్ ఇవ్వలేదు. మక్కలు అమ్మిన రైతులకు ఇంత వరకు డబ్బులు చెల్లించలేదు. రైతుల పంట రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదు. రైతు భరోసాకు దిక్కు లేదు. ఇటీవల మొంథా తుఫాన్‌తో నష్ట పోయిన రైతులకు ఇంత వరకు పరిహారం రాలేదు. జిల్లాలో 5వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. స్వయంగా రేవంత్‌రెడ్డి ఏరియా సర్వే నిర్వహించినా రైతులకు పైసా పరిహారం రాలేదు. గౌరవెల్లి ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదు. రహదారులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. గ్రామ పంచాయతీలకు నిధలు లేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయి.
సర్కారు దవాఖాల్లో సరైన వైద్యం అందడం లేదు. రెండేండ్లుగా జిల్లాకు ఎలాంటి రాలేదు. ఎమ్మెల్యేల కోటా నిధుల జాడలేదు. ప్రత్యేక నిధులు పైసా రాలేదు. దీంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. హుస్నాబాద్ నియోజకవర్గానికి వరప్రదాయిన గౌరవెల్లి రిజర్వాయర్ బీఆర్ఎస్ హయాంలో 90శాతం పూర్తయింది. రేవంత్ సర్కారు మిగిలిన 10శాతం పనులు కూడా పూర్తిచేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొలుతలో రూ.434కోట్ల నిధులు గౌరవెల్లికి కేటాయించామని గొప్పలు చెప్పుకొన్నది.
కానీ, అంతవరకు తట్టెడు మట్టి పనిచేపట్టలేదు. కాలువల నిర్మాణం పూర్తి చేసి హుస్నాబాద్ రైతులకు సాగునీరందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.ఎన్నికలకు ముందు పాదయాత్ర ద్వారా హుస్నాబాద్‌లో పర్యిటించిన అప్పటి పీపీసీ అధ్యక్షుడు, ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి సైతం గౌరవెల్లిని వెంటనే పూర్తి చేసి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ, రెండేండ్లు గడిచినా మోక్షం కలుగడం లేదు. సిద్దిపేటలో వెయ్యి పడకల దవాఖన పనులను రేవంత్ సర్కారు పూర్తిచేయడం లేదు. జిల్లాలో రోడ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుల ఊసే ఎత్తడం లేదు. జిల్లాపై నిర్లక్ష్యం వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా
విస్మరించింది.