సిద్దిపేట,జూన్21: సిద్దిపేట జిల్లాలో నీట్- 2026 పరీక్ష సజావుగా జరిగిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.కలెక్టర్ పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణను పర్యవేక్షించారు. జిల్లాలో మొత్తం 939 మంది అభ్యర్థులకు 812 మంది పరీక్షకు హాజరు కాగా,127 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సెంటర్లో నిఖిత అనే విద్యార్థిని ఒక నిమిషం ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో విద్యార్థిని నిరాశగా వెనుదిరిగింది. పరీక్షా కేంద్రాలను సందర్శించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నీట్ పరీక్షను జిల్లాలో సక్సెస్‌గా నిర్వహించినట్లు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ముగిసిందని, పరీక్ష నిర్వహణలో పాల్గొన్న అధికారులకు ఆమె అభినందనలు తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో 2597 మంది హాజరు
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 21: సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన నీట్ పరీక్ష ముగిసింది. జిల్లాలోని తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,924 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 2597 మంది హాజరయ్యారు. 327 మంది గైర్హాజరయ్యారు. అత్యధికంగా జేఎన్టీయూ సెంటర్-1లో 58 మంది పరీక్షకు డుమ్మా కొట్టగా, అత్యల్పంగా సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 17 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. అభ్యర్థులు మినహా ఇతరులను పరీక్షా కేంద్రం సమీపంలోకి కూడా అనుమతించలేదు. సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ తారా ప్రభుత్వ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేయగా, అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి సిబ్బందితో కలిసి తారా కళాశాల పరీక్షా కేంద్రం చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఎస్పీ పరితోష్ పంకజ్ ఆయా పరీక్షా కేంద్రాలను సందర్శించి బందోబస్తుపై ఆరా తీశారు.