సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, జనవరి 26: సమాజంలోని అన్నివర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో అభివృద్ధ్ది, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు 2,30,483 దరఖాస్తులు స్వీకరించి వంద శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రూ.36 కోట్లతో 840 పాఠశాలల్లో పనులు పూర్తి చేశామన్నారు.
గీత వృత్తిదారులకు వారి భద్రత దృష్ట్యా ప్రభుత్వం మొదటి విడతలో 514, రెండో విడతలో 640 కాటమయ్య రక్షక కవచాలు మంజూరు చేసిందన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద జిల్లాలో 5,007 దరఖాస్తులు రాగా, 2,658 దరఖాస్తులకు చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగిన దేశవ్యాప్త పోటీల్లో సిద్దిపేట మున్సిపాలిటీకి బెస్ట్ క్లీన్సిటీ అవార్డు వచ్చినట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యక్రమాల నిర్మూలన చేస్తూ పోలీసులు ప్రజలతో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ మనుచౌదరి జాతీయ జెండా ఆవిషరించి జెండా వందనం చేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా అభివృద్ధిపై ప్రజలను ద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధులు వెంకటాచారి, రంగు లింగయ్య, గొట్టిముకల లక్ష్మి, ఎస్.పద్మ, దేవుని కొమురయ్య, ఇమ్మడి రాంరెడ్డి, ఇమ్మడి లింగారెడ్డి, సీహెచ్ లచ్చవ్వలను సీపీ అనురాధ, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్యతో కలిసి సన్మానించారు.