సిద్దిపేట అర్బన్, జనవరి 18 : జంతు సంక్షేమానికి ప్రతి పౌరుడు విధిగా నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని జూనియర్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి 30 వరకు పశుసంక్షేమ పక్షోత్సవాల అవగాహన కార్యక్రమంలో భాగంగా పాఠశాల పిల్లలకు అవగాహన సదస్సులు, ర్యాలీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. అవగాహన సదస్సలో ముందుగా రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ వారు జారీచేసిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జంతు సం క్షేమ సంస్థ వారు విడుదల చేసిన కరపత్రాన్ని ప్రతిఒక్కరూ చదివి ప్రజలకు జంతు సంక్షేమం కోసం పాటించాల్సిన నిబంధనలు పశు వైద్యులకు తెలియజేయాలన్నారు. వెటర్నరీ దవాఖాన ప్రాం తంలో ఉన్న పౌల్ట్రీలు, గొర్రెలు, పందులు, డెయిరీఫాంల వివరాలు తప్పనిసరిగా సేకరించుకోవాలన్నారు. జిల్లాలో రోజువారీగా పాలఉత్పత్తులు ఎంత మేర లక్ష్యాన్ని చేరుకుంటున్నామనే సమాచారాన్ని సేకరించాలన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకంలో పౌల్ట్రీ, డెయిరీలు ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులు ఎంత మేరకు లాభాలు పొందుతున్నారో తరుచూ వివరాలు సేకరించాలన్నారు. పొందుతున్న లాభాలను మలి విడత లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జగత్కుమార్రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, సహాయ సంచాలకుడు డాక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.