జిన్నారం, ఆగస్టు 3: పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది. పారిశ్రామికవాడల్లో తగిన వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు.
పారిశ్రామికవాడకు సరైన రహదారి లేకపోవడంతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు పరిశ్రమలను ఏర్పా టు చేసేందుకు ముందుకు రావడం లేదు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకువచ్చి పక్కా దారిని ఏర్పాటు చేయాలని పారిశ్రామిక వాడలోని యజమానులు కోరుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు…
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని శివానగర్ గ్రామ శివారులోని 114 సర్వేనంబర్‌లో 125 ఎకరాల అసైన్డ్ భూమిని 2016లో టీఎస్ఐఐసీ సేకరించింది. అప్పటి నుంచి ఏడేండ్ల పాటు అంతర్గత రోడ్లు, విద్యుత్ సబ్‌స్టేషన్, వీధిలైట్లు తదితర అభివృద్ధి పనులు టీఎస్ఐఐసీ చేపట్టింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు లక్ష్యంగా, కాలుష్యం లేని పరిశ్రమలను ఇక్కడికి తీసుకువచ్చేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పరిశ్రమల ఏర్పాటులో భాగంగా ఎల్ఈడీ బల్బుల తయారీ పరిశ్రమల కోసం 58.5 ఎకరాలు, ఇతర పరిశ్రమల కోసం 46.5 ఎకరాలను అధికారులు కేటాయించారు. సుమారు 62 పరిశ్రమలను ఏర్పాటు చేసేలా టీఎస్ఐఐసీ అధికారులు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం 10 పరిశ్రమల ఏర్పాటుకు నిర్మాణ పనులు పూర్తికాగా, మరో ఐదు పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి.
ముందుకు రాని యాజమాన్యాలు
శివానగర్లోని ఎల్ఈడీ పార్కుకు సరైన దారి లేదు. గ్రామంలోని ప్రధాన రహదారి నుంచి పార్కుకు వచ్చేందుకు మధ్యలో ఇండ్లు ఉండడంతో భారీ వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొడకంచి నుంచి ఇంద్రేశం వెళ్లే ప్రధాన రహదారి నుంచి ఎల్ఈడీ పార్కుకు మట్టి రోడ్డు ఉంది. ఇదే పార్కుకు వెళ్లేందుకు ప్రధాన రహదారి. కానీ, ఈ దారి మొత్తం కూడా అటవీ శాఖ పరిధిలో ఉంది. మూడేండ్లుగా అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకువచ్చేందుకు అధికారులు కృషిచేస్తున్నా ఫలితం లేకుండాపోయింది. సరైన రోడ్డు లేకపోవడంతో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు ముందుకు రావడంలేదు. రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.
నివేదికలు పంపాం..
ఆరున్నర ఎకరాల స్థలంలో రోడ్డు ఉంది. ఇందుకు సరిపడా భూమిని అటవీ శాఖకు ఇచ్చేందుకు టీఎస్ఐఐసీ అధికారులు చర్యలు చేపట్టారు. వంద ఫీట్ల రోడ్డు ఏర్పాటుకు ఉన్నతాధికారులకు నివేదకలు పంపాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం.
-దేవీలాల్, ఫారెస్టు రేంజ్ అధికారి
మౌలిక వసతులు కల్పిస్తున్నాం ..
పరిశ్రమల ఏర్పాటుకు అన్నిరకాల మౌలిక వసతులను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు సమస్య త్వరలోనే పరిష్కారవుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలు ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి పంపాం.
– సంగీత, టీఎస్ఐఐసీ మేనేజర్