సిద్దిపేట, మే 09: ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో రోజు రోజు అవినీతి అధికారుల సంఖ్య పెరుగుతోంది. నియంత్రణ లేదు. అడిగే వారు లేకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏ శాఖ చూసిన ఏమున్నది.. డబ్బులు ఇవ్వనిదే పనులు కావడం లేదు. పైస్థాయి ఉద్యోగులు కింది స్థాయి ఉద్యోగులను, వారి వద్దకు వచ్చిన వారిని పీడిస్తున్నారు. పై అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక కింది స్తాయి ఉద్యోగులు తప్పులు చేస్తున్నారు. వేలల్లో జీతాలు ఉన్నప్పటికీ లంచాలకు పై అధికారులు ఆశ పడుతున్నారు. ఒకటేమిటి అన్ని శాఖల్లో లంచాలు ఇవ్వనిదే పనులు కావడం లేదు.
నిబంధనల ప్రకారం కావాల్సిన పనులకు కూడా డబ్బులు ఇస్తేనే అలా పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా రెవెన్యూ, ఎస్సీ కార్పోరేషన్, బీసీ కార్పోరేషన్, పోలీస్, విద్యుత్, మున్సిపల్, వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయ్, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలతో పాటు జిల్లా కలెక్టరేట్లు, మండల పరిషత్తు, తహాసిల్దార్, పోలీస్స్టేషన్లతోపాటు ప్రధాన కార్యాలయాల్లో ఇది బాగా పెరిగింది. ఉన్నత స్థాయి అధికారులు ఇష్టానుసారంగా కింది స్థాయి ఉద్యోగులపై వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఇటీవల పలువురు అధికారులు లంచాలు తీసుకొని పట్టుబడిన అధికారుల తీరులో మార్పు రావడం లేదు. పైగా లంచాలు తీసుకునేటప్పుడు తెలివిగా తమ డ్రైవర్, లేక ఇతర వారి నంబర్ల మీద ఫోన్‌పే చేయించుకుంటున్నారు. గ్రామాల్లో పనులు చేసే ఉద్యోగుల నుంచి పెట్రోల్, డీజిల్ కోసం వసూలు చేస్తున్నారు. టూర్ విజిట్ పేరున ఉన్నతాధికారి వస్తున్నాడంటే కింది స్థాయి ఉద్యోగికి ముచ్చెమటలు పడుతున్నాయి. ఆ అధికారి ఫిల్డ్కు వచ్చాడు అంటే అతనికి ఎంతో కొంత ముట్టజెప్పాలి. లేకపోతే రికార్డులు తీసుకపోయి సాయంత్రం జిల్లా ఆఫీసుకు వచ్చి కలిసి పోవాలి అని ఆదేశాలు ఉంటున్నాయి. ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఒక పంచాయతీ కార్యదర్శి తన దగ్గర ఏం లేవని చెప్పినా వినకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పైసా ఇస్తేనే ఫైల్ ముందుకు..
జిల్లాలోని ప్రతి శాఖలోనూ అవినీతి రాజ్యమేలుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ ఫైల్ మూవ్ కావాలన్నా బహిరంగంగానే డబ్బులు అడగుతున్నారు. డబ్బులు ఇస్తేనే ఫైల్ క్లీయర్ అవుతుంది. అవినీతికి పాల్పడుతున్న అధికారులు తెలివిగా తప్పంచుకొని.. తమ కింది స్థాయి ఉద్యోగులను ఇరికిస్తున్నారు. అవినీతి శాఖ అధికారులకు పట్టుబడ్డది కొద్ది మంది మాత్రమే.. అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించుకునే వారు చాలా మంది ఉన్నారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఓ తహిసిల్దార్ తన కార్యాలయంలోకి విలేఖరులకు అనుమతి లేదని ఏకంగా బోర్డు పెట్టారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సీరియస్ అయిన విషయం తెలిసిందే.
మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సంతోష్ గౌడ్ రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అయితే హోంగార్డు వెనక అదే స్టేషన్లో పనిచేస్తున్న పై అధికారులు ఉన్నారు. పట్టుబడింది హోంగార్డు.. సేఫ్ అతని పై అధికారులు. పట్టుబడక పోతే వాటాల కోసం అతని వద్ద ముక్కు పిండి తీసుకునే వారు. ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇసుక, గంజాయి తదితర మాఫీయాలకు పోలీసులే ముందు ఉండి నడిపిస్తున్నారనే విమర్శలు జిల్లాలో బలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు మధ్యవర్తిత్వంతో పూర్తిగా పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయి. న్యాయం కోసం స్టేషన్‌కు వస్తే ఎంతో కొంత ముట్ట జెప్పనిదే పని కావడం లేదు. వ్యక్తిగత వివాదాలు, భూతగాదాల్లో తల దూర్చడం అందిన కాడికి దోసుకుంటున్నారు. కొందరి పోలీస్ అధికారుల తీరు పోలీసు శాఖకే మచ్చ తీసుకవస్తుంది. నెల నెల వసూళ్లకు ప్రత్యేకంగా ఒక చిరుద్యోగిని నియమించుకుంటున్నారంటే ఏ మేరకు వసూళ్లకు పాల్పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం జిల్లాలోని కొన్ని పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారాయి అంటే అతిశయోక్తి కాదు. ఏకంగా ఒక ఎస్ఐ.. ఓ నాయకుడి బర్త్ డే వేడుకలను తన ఛాంబర్లో జరిపించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. క్రమ శిక్షణకు మారు పేరు ఉన్న పోలీస్ శాఖకు ఆ శాఖ ఉద్యోగులే మచ్చ తెస్తున్నారు.