సిద్దిపేట, జనవరి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో ప్రకటించింది. సెర్ప్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే నిరాశే మిగిలింది అని చెప్పాలి. ఆ ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతనాలు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 3,915 మంది ఉద్యోగులు ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం 487 మంది పని చేస్తున్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్లు, ఇతర విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం వేతనాలు పడలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మి గెలిపించిన ఉద్యోగులకు ఇప్పుడు ఆ పార్టీ చుక్కలు చూపిస్తోంది. రెండు రోజుల్లో పండుగ ఉంది, తాము పండుగ ఎలా చేసుకునేది అని ఆయా శాఖల ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో కలిపి సెర్ప్ కింద మొత్తం 487 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో162, మెదక్ జిల్లాలో 133మంది, సంగారెడ్డి జిల్లాలో 192 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగులు గ్రామాల్లో కీలక పాత్ర వహిస్తారు. వీరు గ్రామీణాభివృద్ధి శాఖ కింద పని చేస్తారు. గ్రామాలు, పట్టణాల్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం, వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు నందించడంతో పాటు గ్రూప్లోన్స్ ఇప్పించడం, బ్యాక్ రుణాలను మహిళా సంఘాలకు ఇప్పించడం, సకాలంలో రుణాల చెల్లింపులో ఈ ఉద్యోగులది కీలక పాత్ర . ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంతో పాటు ప్రతి సంక్షేమ పథకం అందేలా ఈ ఉద్యోగులు కృషి చేస్తారు. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు. ఇంతలా కృషి చేస్తున్న తమకు వేతనాలను సకాలంలో ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది అని వారు వాపోతున్నారు. ప్రభుత్వం వివిధ శాఖల ఉద్యోగులకు 5వతేదీలోగానే వేతనాలు వేసింది. తమకు మాత్రమే 11వ తేదీ వచ్చినా వేతనాలు వేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్లకు సైతం రెండు నెలలుగా వేతనాలు రావడం లేదని వారు వాపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం వారు 35 మంది వరకు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 18, మెదక్ జిల్లాలో 10, సంగారెడ్డి జిల్లాలో ఏడుగురు పని చేస్తున్నారు.
వీరితో పాటు జిల్లా స్థాయి, మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం వేతనాలు అందలేదు. నమస్తే తెలంగాణ సేకరించిన వివరాల ప్రకారం మరికొన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా వేతనాలు అందలేదని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వేతనాలు ఆలస్యమయ్యాయి.. ఈఎంఐలు ఎలా కడతారు అని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు మరీ ఇవాళ సకాలంలో అన్ని శాఖల ఉద్యోగులకు ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ అన్ని వర్గాలను, ఉద్యోగులను మోసం చేస్తున్నదని విమర్శించారు. గ్రామాల్లో కీలకంగా పనిచేసే ఉద్యోగులకే 11వ తేదీ వచ్చినా వేతనాలు రాలేదంటే వారు సంక్రాంతి పండుగను ఎలా చేసుకుంటారు. ఈ విషయం ప్రభుత్వానికి తెల్వదా? ఎందుకు ఆ ఉద్యోగులపై వివక్ష… తక్షణమే మిగతా ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా వేతనాలు చెల్లించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు.