మెదక్, డిసెంబర్ 14 : నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ పూర్వ జిల్లాల్లో సీనియార్టీ జాబితాను పూర్తి చేయడంతో పాటు మిగిలిన ఐదు పూర్వ జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులందరికీ ప్రాధాన్యతనిస్తూ సీనియార్టీ జాబితాను రూపొందించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఉద్యోగుల కేటాయింపు 317 జీవోపై జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, 2018 నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును సమీక్షించారు. సమయపాలన కచ్చితంగా పాటిస్తూ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులందరినీ కేటాయించి ఎవరూ మిగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇతర శాఖల్లో డిప్యుటేషన్స్పై పనిచేస్తున్న ఉద్యోగులను మాతృశాఖలో చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్ కలెక్టర్ హరీశ్ మేడ్చల్ నుంచి పాల్గొనగా మెదక్ నుంచి పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్క ఉద్యోగి రేపటిలోగా మూడు ప్రిఫరెన్స్ల ప్రకారం ఆప్షన్ ఫారం శాఖాధిపతులకు అందజేయాలని సూచించారు. దీర్ఘకాలిక సెలవులు, అబ్స్టాండింగ్, సస్పెన్షన్‌లో ఉన్నా ఎవరు మిస్‌కాకుండా ఉద్యోగుల కేటాయింపు జరగాలని ఆమె సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ బాలస్వామి, జడ్పీ సీఈవో శైలేశ్, డీఈవో రమేశ్‌కుమార్, డీపీవో తరుణ్ కుమార్, డీఎస్వో శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.