కోహెడ, జనవరి 21: మండలంలోని కూరెల్ల గ్రామ శివారు గుట్టపై ప్రతాపరుద్ర సింగరాయ జాతరకు భక్తులు పోటెత్తారు. కొవిడ్ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు జాతర జరిగినప్పటికీ భక్తులు పెద్దగా హాజరుకాలేదు. ఈసారి జనం భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది.
కొన్నేళ్లుగా తంగల్లపల్లి, కూరెల్ల గ్రామాల మధ్య గొడవ జరుగుతుండటంతో ఈసారి రెవెన్యూ, పోలీస్ అధికారులే జాతర నిర్వహించారు. ఉదయమే కూరెల్ల సర్పంచ్ గాజుల రమేశ్ దంపతులు ఆలయంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ కొక్కుల కీర్తి సైతం స్వామివారిని దర్శించుకున్నారు. సిద్దిపేట డీసీపీ సందెపోగు మహేందర్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ జావీద్ అహ్మద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.