సంగారెడ్డి, మే 21 : సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రం పరిశోధనల్లో దేశంలో రెండోస్థానంలో నిలిచినట్లు పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర అన్నారు. మంగళవారం ఫల పరిశోధన కేంద్రంలో మామిడి పండ్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్ హాజరయ్యారు. ప్రదర్శనను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి మామిడి రకాల ప్రదర్శనను ఆమె సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర మాట్లాడుతూ.. నాటి నైజాం పాలనలో గుర్రాల పాకగా ఉపయోగించిన మైదానాన్ని నేడు ఫలపరిశోధన కేంద్రంగా ప్రభు త్వం తీర్చిదిద్దిని గుర్తుచేశారు. నైజాం పాలనలో నాటించిన మామిడి మొక్కలు, జామ తోటల పెంపకంతో దినదిన అభివృద్ధి చేస్తూ నేడు దేశంలో ప్రముఖ ఫల పరిశోధన కేంద్రంగా నిలవడం గర్వకారణమన్నారు.
ఆసియాలోనే గుర్తింపు సాధించిన ఫల పరిశోధన కేంద్రంగా సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్కు పేరుందని గుర్తుచేశారు. ఇక్కడ నుంచి మేలు రకమైన వంగడాలను రూపొందించి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో రూపొందించిన మంజీర రకం మామిడి ఎంతో డిమాండ్ ఉన్నట్లు తెలిపారు. 477 రకాల వంగడాలను రూపొందించినట్లు సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 15వేల ఎకరాల్లో మామిడి తోటలు పెంచుతున్నారని డీహెచ్ఎస్వో సోమేశ్వర్రావు అన్నా రు. మామిడి తోటల్లో అంతర పంటలు వేసుకుని మంచి ఆదాయం పొందవచ్చని సూచించారు. 1988లో 267 రకాల మామిడి పండ్లు ఉండేవని, ప్రస్తుతం 477 రకాలకు పెరగడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ కిరణ్కుమార్, హరికాంత్, ఉద్యానవన అధికారి శ్రీధర్, మాధురి, మౌనిక, నితీశ్, రైతులు నర్సింహారెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.