జగదేవపూర్ ఫిబ్రవరి 6: సిద్దిపేట జిల్లా దౌలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండడంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు బడికి తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం మండల వనరుల కేంద్రానికి చేరుకొని మండల విద్యాధికారి మాధవరెడ్డికి వినతిపత్రం అందించి, పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ…గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గతంలో 120 మంది విద్యార్థులుండగా నేడు ఆ సంఖ్య 80కి చేరిందన్నారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులంతా ప్రైవేటు బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
7 తరగతులకు ముగ్గురు ఉపాధ్యాయులతో బోధన ఎలా చేస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను కేటాయించకపోతే విద్యార్థుల సంఖ్య ఇంకా తగ్గుతుందని, మిగిలిన కొంతమంది విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారని పేర్కొన్నారు. పాఠశాలకు రెండు మూడు రోజుల్లో టీచర్లను నియమించాలని, లేనిపక్షంలో జగదేవపూర్ ప్రధాన రోడ్డుపై ధర్నా చేస్తామని హెచ్చరించారు. దీంతో ఎంఈవో మాధవరెడ్డి జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి తక్షణం ఒక టీచరును డిప్యుటేషన్‌పై పంపించనున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు టీచర్లను వారం రోజుల్లో నియమిస్తామని, 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల నియామకాలతో పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సైదులు, కొండపోచమ్మ దేవాలయ మాజీచైర్మన్ ఉపేందర్‌రెడ్డి, నాయకులు జయమ్మ, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.