సిద్దిపేట కలెక్టరేట్, ఆగస్టు7: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అధికారులు త్వరగా స్పందించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఇతర అంశాలపై సం బంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాటిలో లబ్ధిచేకూర్చిన కేసుల వివరాలు,పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనప్పుడు పోలీస్,ఇతర అధికారులు స్పందించాలన్నారు. కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
మారుమూల ప్రాంతాల నుంచి విద్య కోసం వచ్చే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ హాస్టళ్లు, గురుకులాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. హాస్టల్లో ప్రవేశం కోరిన విద్యార్థులకు తప్పకుండా కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కేణిగుంట్ల ప్రవీణ్ కుమార్, కుస్రం నీలాదేవి, రాంబాబునాయక్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మల్లారెడ్డి, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కవిత, గిరిజన అభివృద్ధి అధికారి అఖిలేశ్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ సీతారాంరెడ్డి పాల్గొన్నారు.