Siddipeta | నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది.. చట్నీలో కారంపొడి చల్లుకొని అక్కడ ఇడ్లీ తిన్నారంటే చాలు ఆ టేస్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేరు.. ఇరవై ఐదేండ్ల కింద ప్రారంభమైన ఆ టిఫిన్ సెంటర్ నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నది. మొదట్లో ఇడ్లి ఎంత ధర ఉందో ఇప్పటికీ అంతే ఉంది. కేవలం రూపాయికే ఒక చిట్టి ఇడ్లి.. పది రూపాయలకు పది ఇడ్లిలు ఇస్తూ టిఫిన్ సెంటర్‌కు వచ్చే వారి మనసును గెలుచుకుంటున్నారు నిర్వాహకుడు సత్యనారాయణ. స్కూల్ పిల్లలు మొదలుకొని వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు.. ఉద్యోగులు, వ్యాపారులు సైతం రోజూ ఇక్కడ టిఫిన్ చేయకుండా ఉండలేరు. నిత్యం ఆ టిఫిన్ సెంటర్ జనంతో కళకళలాడుతోంది.
– సిద్దిపేట కమాన్, జూలై 15
సిద్దిపేట కమాన్, జులై 15 : సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లగానే ఎదురుగా చిన్న బండిపై టిఫిన్ సెంటర్ కనబడుతుంది. సిద్దిపేట పట్టణవాసులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి ఈ టిఫిన్ సెంటర్ ఎంతో సుపరిచితం. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏ ధరలు ఎంత పెరిగినప్పటికీ ఈ టిఫిన్ సెంటర్లో మాత్రం రూపాయికే చిట్టి ఇడ్లీ లభిస్తున్నది. అలాగే ఉప్మా కేవలం రూ. పదికే లభిస్తుంది. అదే ఇతర టిఫిన్ సెంటర్లలో ప్లేట్ ఇడ్లీ రూ.30 నుంచి 35 వరకు ధర ఉంటుంది. తక్కువధరకు అందరికీ కడుపునింపడమే సంతోషంగా భావిస్తూ టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఏండ్ల నాటి నుంచి అదే స్థలం.. అదే బండి.. అదే ధరతో టిఫిన్ సెంటర్ 25 ఏండ్లుగా కొనసాగుతూ వస్తుంది. పట్టణానికి చెందిన సత్యనారాయణ అంతకుముందు 10-15 ఏండ్లుగా హోటళ్లలో పనిచేశాడు. అదే అనుభవంతో చిట్టి ఇడ్లీ వేస్తే ఎలా ఉంటుందని ఆలోచన మెదిలింది. దీంతో అప్పడు చిట్టి ఇడ్లీలు తయారు చేస్తూ వీధుల్లో తిరుగుతూ అమ్ముకునేవాడు. తర్వాత ఒకచోట టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశా డు. తక్కువ రేటుకు టేస్ట్‌గా ఇడ్లీ తయారు చేస్తూ కస్టమర్ల వద్ద ప్రేమను సంపాదించుకున్నారు. టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
25 ఏండ్లుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్న. అప్పుడు రూపాయితో చిట్టి ఇడ్లీ ప్రారంభించా.. ఇప్పటికీ అదేధరకు అమ్ముతున్న. 10 రోజులు టిఫిన్ సెంటర్ తీయకున్నా కస్టమర్లు ఎటుపోరు. తీయగానే మళ్లీ వస్తరు..కొడుకు నాకు సాయం చేస్తూ బ్యాంకులో ఉద్యోగం చేస్తడు.. ముగ్గురు కూతుళ్లు.. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. ఉదయం 7 నుంచి 12.30 గంటల వరకు నడుపుతా.. మస్తు గిరాకీ ఉంటది. నా టిఫిన్ సెంటర్లో ఇడ్లీ టేస్ట్ చేసిన వారు మరెక్కడికి వెళ్లరు. తింటే ఇక్కడే తింటరు.
– సత్యనారాయణ (ఇడ్లీ సెంటర్ నిర్వాహకుడు)
చిన్నప్పటి నుంచి (20 సంవత్సరాలుగా) ఇక్కడే ఇడ్లీ తింటున్న.. ఇక్కడ ఇడ్లీ తిన్నామంటే ఆ టేస్టే వేరనిపిస్తది.. సిద్దిపేటలో ఎక్కడతిన్నా ఇంత మంచిగా అనిపించదు. తొందరగా డైజేషన్ అవుతుంది. చిట్టీ ఇడ్లీలు రూ.10కి పది ఇస్తడు… ఇక్కడ రుచి చూశాక మరెక్కడా తినరు.. అంత బాగుంటుంది..
– పాల సందీప్‌కుమార్ (కస్టమర్)