జిన్నారం, నవంబర్ 12: ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టగా ఆయన మద్దతు పలికారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించని పక్షంలో భారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొత్తమున్సిపల్ చట్టం ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.