సంగారెడ్డి, డిసెంబర్ 13 : దేశానికి కావాల్సిన రక్షణ రంగ ఉత్పత్తులు తయారుచేయడంలో సంగారెడ్డి జిల్లా కందిలో ఏర్పాటు చేసిన ఓడీఎఫ్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నదని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, జీఎం అలోక్ప్రసాద్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారం(మెదక్ ఓడీఎఫ్) క్రీడామైదానంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఓడీఎఫ్‌లో తయారు చేసిన యుద్ధట్యాంకులు, పరిశ్రమలో చేపట్టిన వివిధ అంశాల చిత్రాలను సోమవారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి హాజరై ఓడీఎఫ్ జీఎం అలోక్ ప్రసాద్‌తో కలిసి ప్రదర్శన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో ఓడీఎఫ్ పరిశ్రమలు తయారు చేసి, దేశ రక్షణకు అందజేస్తున్న ఆయుధ సామగ్రి ప్రదర్శనలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌లో ప్రారంభించారు. మంత్రి సందేశాన్ని ఓడీఎఫ్ జనరల్ మేనేజర్‌తో సహా ఉద్యోగులు, మహిళలు పాల్గొని వీక్షించారు. అనంతరం ముఖ్య అతిథి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. రక్షణ రంగ ఉత్పత్తుల్లో మనదేశం ఎగుమతులు చేసే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఐఐటీ హైదరాబాద్‌కు తొలి అడుగులకు కేంద్రంగా ఓడీఎఫ్ నిలిచిందని, ఇంతటి గొప్ప స్థానాన్ని ఐఐటీకి అందించిన ఆయుధ కర్మాగారానికి రుణపడి ఉంటామన్నారు. సాంకేతిక రంగంలో ఐఐటీ సేవలు ఓడీఎఫ్ పరిశ్రమకు ఉపయోగపడేవిధంగా అధ్యాపకులు, విద్యార్థులతో తాము సిద్ధంగా ఉన్నామని, సేవలు చేయడం ఐఐటీ ముఖ్య ఉద్దేశమన్నారు. గతంలో బీటెక్ చేసిన విద్యార్థులను ఓడీఎఫ్ పరిశ్రమ ఉపయోగించుకున్న విధంగా, ఎంటెక్ విద్యార్థులకు ప్రాజెక్టు షెడ్యూల్ ఇవ్వడానికి నిర్ణయించడం సంతోషకరమన్నారు. త్వరలో అందుకు సంబంధించిన ఆరు ప్రాజెక్టులను ఐఐటీకి ఇచ్చేందుకు ఓడీఎఫ్ జీఎం చర్యలు తీసుకోవడం గొప్ప విషయమన్నారు.
మెదక్ ఓడీఎఫ్‌కు ఘనమైన పేరు..
ఓడీఎఫ్ జీఎం అలోక్ ప్రసాద్ మాట్లాడుతూ.. 1984లో ఓడీఎఫ్ పరిశ్రమను స్థాపించేందుకు అడుగులు వేసి, మూడేండ్ల వ్యవధిలోనే ప్రారంభించుకున్నట్లు తెలిపారు. దేశ రక్షణ రంగానికే సాంకేతిక పరిజ్ఞానాన్ని, మంచి ఆయుధాలను అందించిన సంస్థగా మెదక్ ఓడీఎఫ్‌కు ఘనమైన పేరు ఉందన్నారు. ఇప్పటి వరకు రక్షణ రంగానికి అవసరమైన సామగ్రిని రష్యా నుంచి దిగుమతి చేసుకుని పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్నామని, ఇక నుంచి దిగుమతికి స్వస్తి పలికి ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదుగుతోందన్నారు. రక్షణరంగ ఆయుధ తయారీలో స్వశక్తి కేంద్రంగా మెదక్ పరిశ్రమ గుర్తింపు సాధించిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ ఆయుధ కర్మాగారాల్లో 98.05 పాయింట్లు మెదక్ ఓడీఎఫ్ ముందంజలో ఉందన్నారు. ఫోఖ్రాన్‌లో నిర్వహించిన రాకెట్ పరీక్షలో మెదక్ డిఫెన్స్‌లో తయారైన ఆయుధ సంపత్తి ఉడడం గర్వకారణమన్నారు. అనంతరం బిపిన్ రావత్ దంపతులతో పాటు అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. ముఖ్య అతిథి మూర్తికి షీల్డ్‌ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ జీఎంలు నాగబాబు, ప్రభాకర్, ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబీకులు పాల్గొన్నారు. పిల్లలు ప్రదర్శన క్షేత్రానికి వచ్చేసి యుద్ధ్ద ట్యాంకుల ముందు ఫొటోలు, సెల్పీలు దిగి సందడి చేశారు. సీసీపీటీ యుద్ధ ట్యాంకర్ శత్రు సైన్యాలను చిత్తుచేసే విధంగా భూతలంపై 65 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను మట్టుబెట్టగలిగే సామర్థ్యం ఉందని అధికారులు ప్రదర్శన ద్వారా తెలియజేశారు.