ఝరాసంగం, ఆగస్టు 6: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో సిలిండర్ లీక్ కావడంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం..వృద్ధురాలు గొర్రెకంటి శంకరమ్మ బుధవారం ఉదయం వంట చేసుకుంటున్న సమయంలో ఎల్పీజీ సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజ్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వృద్ధురాలు నీళ్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించగా మంటలు తీవ్రతరం అవడంతో ఆమెకు సహాయపడేందుకు వచ్చిన ఇద్దరు కుమారులు ప్రభు, విఠల్ కూడా మంటలో గాయపడ్డారు.
మంటలు పెరగక ముందే ముగ్గురూ ఇల్లు విడిచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స కోసం జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. గ్యాస్ లీకేజీ ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.