న్యాల్కల్, డిసెంబర్ 12 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం బసంతపూర్ గ్రామ శివారులోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను 2010లో ప్రారంభించారు. కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులంతా స్థానిక హాస్టల్లోనే ఉంటున్నారు. ఉదయం, సాయంత్రం పరిశోధన కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతుల పొలాలకు వెళ్లి పంటలను గమనిస్తుంటారు. పంటలకు ఆశించే తెగుళ్లు, చీడపురుగులను నివారించేందుకు మందులు పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. స్థానిక పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో విద్యార్థులు పరిశోధన కేంద్రంతో పాటు రైతులు సాగు చేసిన పంటపొలాలకు వెళ్లి పంటలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చదువుతో పాటు పంటలపై పరిశోధనలు చేసి విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటున్నారు. కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయశాఖతో పాటు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, నూతన వంగడాలపై అవగాహన కల్పించి రాష్ట్రంలోనే వ్యవసాయ పరిశోధన కేంద్రంలోని ఉత్తమ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలగా నిలుస్తోంది.
ఉద్యోగాలు చేస్తున్న పూర్వ విద్యార్థులు..
పాలిటెక్నిక్ కళాశాలలో 2010లో చదువుకున్న ముగ్గురు విద్యార్థులు ప్రస్తుతం జిల్లాలోని పటాన్చెరువు సమీపంలోని ఇక్రిశాట్లో సీనియర్ ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పట్లో ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాలలో వికాస్, ప్రవీణ్‌కుమార్, వీరేశం రెండేండ్ల అగ్రికల్చర్ డిప్ల్లొమా కోర్సు పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరారు. గత ఎనిమిదేండ్లుగా ఇక్రిశాట్లో సీనియర్ ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఇక్రిశాట్లో ప్రతిరోజూ సాగు చేసిన నూతన వంగడాలతో పాటు పలు పంటలపై పరిశోధనలు చేస్తున్నారు. శాస్త్రవేత్త, ప్రిన్సిపాల్ డాక్టర్. విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో అధ్యాపకులు అందించిన ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపురుగుల నివారణ కోసం తీసుకునే చర్యలు, సూచనలు, సలహాలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పూర్వ విద్యార్థులు తెలిపారు.
విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నాం..
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్థులను యువ శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఆధునిక పద్ధతులు, పంటల దిగుబడి, సస్యరక్షణ చర్యలపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం, సాయంత్రం విద్యార్థులను పంటపొలాలకు తీసుకెళ్తున్నాం. పంటలను పరిశీలించి, వాటిల్లో వస్తున్న మార్పులను గమనించి తీసుకునే చర్యలపై అవగాహన కల్పిస్తున్నాం.స్థానిక కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు, ఎరువులు తదితర కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు.
-డాక్టర్.విజయ్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్, ప్రధాన శాస్త్రవేత్త, బసంతపూర్ (సంగారెడ్డి జిల్లా)
శాస్త్రవేత్తలు, అధ్యాపకులకు రుణపడి ఉంటాం..
బసంత్‌పూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్, శాస్త్రవేత్తలు ,అధ్యాపకులకు రుణపడి ఉన్నా. కళాశాలలో చదివే సమయంలో ఆధునిక వ్యవసాయం, నూతన వంగడాలు, పంటలకు ఆశించే తెగుళ్లు, చీడపురుగుల నివారణ కోసం తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు, అధ్యాపకుల సలహాలు, సూచనలు, అనుభవాలతోనే ఇక్రిశాట్లో సీనియర్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేసే అవకాశం దక్కింది. విద్యార్థులను యువ శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులుగా తయారు చేసేందుకు పాలిటెక్నిక్ కళాశాల శాస్త్రవేత్తలు, అధ్యాపకులు చేస్తున్న కృషి మరువలేనిది.