సంగారెడ్డి, మే 3 : సంగారెడ్డి జిల్లాలో నమోదైన అత్యాచారం, పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులకు జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నాడు ఎస్పీ పరితోశ్ పంకజ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని డీఎస్పీలకు సూచించారు.
దీర్ఘకాలికంగాపెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ప్రతి సర్కిల్ పోలీస్టేషన్ పరిధిలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మిస్సింగ్ కేసులు, ఎన్బీడబ్ల్యూ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అదనపు ఎస్పీ సంజీవరావుతోపాటు దర్యాప్తు బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. ఆస్తి సంబంధిత నేరాల్లో పాతనేరస్తులపై నిఘా ఉంచాలని, గంజాయి స్మగ్లర్ల ఆస్తులను కోర్టుకు ఆటాచ్ చేయాలని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్, బెట్టింగ్యాప్స్, ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఆన్లైన్ మోసాలు జరగకుండా సైబర్ వింగ్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచటంతోపాటు మోసానికి గురైన వెంటనే 1930కి ఫిర్యాదు చేసేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతి పోలీసు అధికారి దృష్టి సారించాలని సూచించారు. తమ పోలీస్టేషన్ పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్లు, నెంబర్ప్లేట్ల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.