
జిల్లా, మండల, గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు
పాఠశాల ఆవరణలో కలుపు మొక్కల తొలగింపు
ఈ నెల 30లోపు సర్వం సిద్ధం
ఆనందంలో విద్యార్థులు, తల్లిదండ్రులు
ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న ప్రత్యేకాధికారులు
ముమ్మరంగా పారిశుధ్య, శానిటైజేషన్ పనులు
ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల పునఃప్రారంభానికి విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని అన్ని పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నది. పాఠశాలల్లో కల్పించాల్సిన వసతులు, ఇతర అంశాలపై అన్ని జిల్లాల, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, దిశానిర్దేశం చేస్తున్నది. ఈ నెల 30వ తేదీలోగా శానిటైజేషన్ పూర్తి చేసి సిద్ధం చేయనున్నది. పాఠశాలల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నది. మరో వైపు విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కొనసాగుతున్నది. కరోనాతో 18 నెలలుగా మూతపడ్డ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కానున్నది. ఇన్నాళ్లు ఇంటి వద్దే ఉన్న విద్యార్థులు చాలా రోజుల తర్వాత ప్రత్యక్ష తరగతులకు హాజరవుతుండడంతో వారిలో సంతోషం కనిపిస్తున్నది. కాగా, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 40 శాతం వరకు ఖర్చు చేయనున్నారు. పాఠశాలలకు వచ్చే గ్రాంట్‌ను కూడా ఆయా పాఠశాలల అభివృద్ధికి వాడనున్నారు.
సిద్దిపేట, ఆగస్టు (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లాల్లో బడుల ప్రారంభానికి అధికార యంత్రాంగం ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నది. అన్ని పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నది. పాఠశాలల్లో కల్పించాల్సిన వసతులు, ఇతర అంశాలపై అన్ని జిల్లాల, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, దిశానిర్దేశం చేస్తున్నది. ఆయా గ్రామాల పాఠశాలలకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరు ప్రతి రోజూ ఆయా పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలకు దూరమైన విద్యార్థులు ఇప్పుడు బడిబాట పట్టనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతుల జరగనున్నాయి. సిద్దిపేట జిల్లాలో 636 ప్రాథమిక పాఠశాలలు, 113 ప్రాథమికోన్నత, 227 ఉన్నత, 210 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. మెదక్ జిల్లాలో 624 ప్రాథమిక, 129 ప్రాథమికోన్నత, 154 ఉన్నత, 108 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 864 ప్రాథమిక,197 ప్రాథమికోన్నత, 203 ఉన్నత, 438 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు పంపించగా, వాటిని విద్యార్థులకు ఉపాధ్యాయులు పంపిణీ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆన్లైన్ చదివిన విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమై, అర్థం కాక సతమతమైన వారికి మరో నాలుగు రోజుల్లో ప్రత్యక్ష తరగతులకు హాజరు అవుతుండడంతో ఆ దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారు. విద్యార్థులకు కావాల్సిన నోట్ బుక్స్, బ్యాగులు తదితర వస్తువులను కొన్నిచ్చే పనిలో విద్యార్థుల తల్లిదండ్రులు పడ్డారు. ఇన్నాళ్లు ఇంటి వద్దే ఉన్న విద్యార్థులు చాలా రోజుల తర్వాత ప్రత్యక్ష తరగతులకు హాజరవుతుండడంతో వారిలో సంతోషం కనిపిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో పాఠశాలలు ప్రారంభానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తున్నది. ప్రభుత్వ ఆదేశాలతో ఆయా పాఠశాలలకు నియమించిన ప్రత్యేకాధికారులు ప్రతీ పాఠశాలను సందర్శించి, పనులను పర్యవేక్షణ చేస్తున్నారు. ఇన్ని రోజులు ఆన్లైన్ తరగతులు విన్న విద్యార్థులు, సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యేక తరగతులకు హాజరు కానున్నారు. ఈ మేరకు గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలతో పాటు వసతి గృహాలను శుభ్రపరచి, ఈ నెల 30వ తేదీలోగా శానిటైజేషన్ పూర్తి చేసి సిద్ధం చేయనున్నారు. రెండు మూడు రోజులుగా జిల్లాలోని మండల, గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించుకొని పాఠశాలలో చేపట్టాల్సిన అంశాలపై చర్చించి, అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేసుకొని పనులు చేస్తున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని చెత్తను తొలగిస్తున్నారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రత, మరుగుదొడ్ల పరిశుభ్రత, పాఠశాల ఆవరణలో కలుపు మొక్కలను తొలగిస్తున్నారు. ఆయా పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆవరణలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, గదులను శుభ్రం చేయడం, నీటి వసతులను కల్పించడం, తదితర పనులు చేయిస్తున్నారు. పాఠశాలల్లో ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి 40 శాతం వరకు ఖర్చు చేయనున్నారు. పాఠశాలలకు వచ్చే గ్రాంట్‌ను కూడా ఆయా పాఠశాల అభివృద్ధికి వాడనున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాఠశాలల ప్రారంభానికి విద్యాశాఖాధికారుల నేతృత్వంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి ఉపాధ్యాయులందరూ పాఠశాలకు హాజరవుతున్నారు. ఏడాదిన్నరగా మూసి ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు మెరుగుపర్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా గ్రామ, మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశాలు నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు మండల స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించారు. మండల స్థాయి అధికారులకు నాలుగు నుంచి ఐదు గ్రామాలకు ఒక్కరిని నియమించారు. వీరంతా వారివారి గ్రామా ల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్, కేజీవీబీ, ఆదర్శ పాఠశాలలను తనిఖీ చేస్తూ గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు.
కరోనా భయంతో రెండేండ్ల నుంచి బడు లు బంద్ అయ్యాయి. పిల్లలు ఇంటి వద్దనే ఉన్నారు. నిన్న మొన్నటిదాక పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనన్న బెంగ ఏర్పడ్డది. బడులు నడువకపోతే ఇంటి వద్దనే పిల్లలు చేస్తున్న అల్లరి అంతా, ఇంత కాదు. బడికి పోతేనే పిల్లలు సంస్కారవంతంగా ఉంటరు. బడులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు.
కరోనాతో పిల్లలు చదువులకు దూరమయ్యారు. ఆన్లైన్లో చదువులు జరుగుతున్నా, పిల్లలకు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. నా కొడుకు గురుకుల పాఠశాలలో చదువుతాడు. కరోనా భయం కొద్దిగ పోయిందని ధైర్యంగా పంపుతం. ప్రభుత్వం పిల్లలపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని మాకు నమ్మకం ఉంది.
మా కూతరు తన్విక జడ్పీహెచ్లో 8వ తరగతి చదువుతున్నది. దాదాపు రెండేళ్లయితాంది పిల్లలు బడికి పోక. ఇంటి దగ్గర ఎంత సదివినా బడిలో సదువుకున్నట్టు ఉండదు. ఇప్పటికైనా స్కూల్లు తెరుస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒక పేరెంట్‌గా మేము బాధ్యతగా ఉండి, మా పిల్లలకు కచ్చితంగా మాస్క్‌లు ధరించిన తర్వాతే స్కూల్‌కు పంపిస్తాం.
ప్రత్యక్ష బోధన ద్వారా మాత్రమే పిల్లలకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. ఆన్లైన్ తరగతుల ద్వారా పిల్లలకు పాఠాలు అర్థం కాకపోగా, అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం పాఠశాలలు ఓపెన్ చేసి మంచి నిర్ణయం తీసుకుంది.
బడులు, కాలేజీలను ప్రారంభించాలని సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని పిల్లల తల్లిదండ్రులుగా మేము స్వాగతీస్తున్నాం. ఆన్లైన్లో సార్లు చెప్పే పాఠాలు అర్థం కాక పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రతిరోజూ బడికి పోతెనే పిల్లలకు పాఠాలు అర్థమవుతాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం బడులను ప్రారంభించేందుకు సిద్ధం కావడం శుభపరిణామం.