ఝరాసంగం, డిసెంబర్ 12: సాగునీటి బోర్లతో పాటు చెరువులు, చెక్‌డ్యాంల కింద పెద్ద ఎత్తున రైతులు వానకాలం, యాసంగిలో పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు ఉచింత కరంట్ ఇవ్వడంతో రెండు పంటలు పండుతున్నాయి. దీంతో పండిన పంటలను రైతులు గతంలో చేలల్లోనే టార్పాలిన్లతో ఆరబెట్టడం, రోడ్లపై కుప్పలు పోసి ఆరబెట్టడంతో అనేక ఇబ్బందులకు గురయ్యారు. పంట చేల నుంచి రోడ్డుపైకి తేవడానికి రవాణా చార్జీలు అయ్యేవి. తెలంగాణ ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తమ పంట చేలల్లోనే కల్లాలు నిర్మించుకునేలా చేసింది. పంట కల్లాలపై ప్రత్యేక కథనం…
మండల వ్యాప్తంగా 283 పంట కల్లాలు..
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రైతు లు పండించిన పంటను తూర్పార పట్టేందుకు కల్లాల నిర్మాణం చేపడుతున్నది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 2 కోట్ల 7 లక్షలు మంజూరు చేయగా, ఇప్పటికే రూ. 17.18 లక్షలు విడుదల చేసింది. మండల వ్యాప్తంగా 283 పంట కల్లాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 283కు మంజూరైనట్లు అధికార యంత్రాంగం చెబుతున్నది. ఇందులో 37 నిర్మాణ దశలో ఉండగా, 23 పూర్తయ్యాయి, జూన్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన వర్షాలతో నిర్మాణాల్లో కొంత జాప్యం జరుగగా, జనవరిలోగా వందశాతం పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
రైతులకు ఎంతో ప్రయోజనం…
మండలంలో నల్లరేగడి భూములు ఉన్నాయి. దీంతో పంటను ఆరబోసుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడేవారు. వానకాలం, యాసంగి సీజన్లలో రైతులు సాగు చేసిన మక్క, సోయా, పెసర, మినుము, పసుపు తదితర పంటలను ఆరబెట్టాలంటే ఇంటికి తీసుకొచ్చి వాకిళ్లు. రోడ్లపై పోసేవారు. రాత్రింబవళ్లు ఆ పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడేవారు. పంట చేల నుంచి రోడ్డుపైకి తెచ్చిన తర్వాత మార్కెట్‌కు తరలిచేందుకు రెండు సార్లు రవాణా అవసరమయ్యేది. ఇప్పు డు పంట కల్లాల్లోనే పంటను ఆరబెట్టి నేరుగా మార్కెట్‌కు తరలించడం, అమ్మడం వంటివి చేస్తున్నారు. దీంతో రైతులకు వ్యవప్రయాసలు తప్పాయి. రోడ్లపై పంటను ఆరబెట్టడంతో ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత రైతుపై పోలీసుశాఖ కేసులు కూడా పెట్టింది. దీంతో ప్రభుత్వం రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని పంట కల్లాల నిర్మాణం చేపట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కల్లానికి అయ్యే ఖర్చులో పదిశాతం రైతులు చెల్లిస్తే మిగతా 90 శాతం నిధులను ప్రభు త్వం విడుదల చేస్తుంది.
ఎలాంటి ఇబ్బందులు లేవు
మా ఊళ్లో చెరువు గట్టు కింద పంట భూమి ఉంది. దీంతో ఏ పంట ఆరబెట్టాలన్నా రోడ్లపై వేయడం, టార్పాలిన్లలో పంటను ఆరబెట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ప్రభుత్వం పంట కల్లాల నిర్మాణం చేసుకోవాలని సూచించడంతో దరఖాస్తు చేసుకోగానే మంజూరైంది. నెల రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసి పండిన పంటను నిల్వ ఉంచుకునేందుకు ఎంతో ఉపయోగపడుతున్నది.