
నారాయణఖేడ్, జూన్ 29 : ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం వర్తించని పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన వారిని ఆదుకునే దిశగా కేసీఆర్ ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నదన్నారు. సీఎం రిలీఫ్‌ఫండ్‌తో పేద ప్రజలకు ఆరోగ్య భద్రత ఉంటుందన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) గ్రామ మాజీ సర్పంచ్ శంకర్‌నాయక్ సోమవారం మృతి చెందాడు. మం గళవారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి శేరితండాల్లో శంకర్‌నాయక్ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శంకర్‌నాయక్ మృతికి గల కారణాలను తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి సన్మానం
అట్టడుగు వర్గాల అభ్యున్యతిని కాంక్షించి సీఎం కేసీఆర్ దళిత సాధికారత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి తెలిపారు. దళిత సాధికారత కార్యక్రమాన్ని హర్షిస్తూ మంగళవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్‌నాయక్ ఆధ్వర్యంలో దళిత ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించారు. దళితుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం చారిత్రక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు.