సంగారెడ్డి, జూన్ 26 : సమాజంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ, ఆకలి తీర్చి వసతి కల్పించే వారికి వచ్చినంత గుర్తింపు మరేవరికి రాదనేది సత్యం..అలాంటి సేవాభావంతో ఆరంభించి నిరంతర సేవలు అందించేందుకు ప్రారంభమైన అయ్యప్ప ఆపద్బాంధు సేవా సమితి గత నెల 17న ప్రారంభించిన నాటి నుంచి సేవలు చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నది. సమాజంలో ప్రతిఒక్కరి మదిలో సేవ చేయాలని ఆలోచన ఉన్నా వచ్చిన ఆలోచనను అమలు చేస్తేనే సార్థకత లభిస్తుందని సేవా సమితి చేసి చూపిస్తున్నది. అయ్యప్ప మాలధారణ వేసుకున్న స్వాములతో పాటు తమకు సన్నిహితులుగా ఉండే వారిని సమితిలో సభ్యులుగా చేసి ఒక కుటుంబంగా ఏర్పడి పేదలకు సేవ చేస్తున్నారు. ముఖ్యంగా అనాథ పిల్లలకు తమ వంతుగా బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. జిల్లాల దవాఖానలో డయాలిసిస్ సేవలు పొందుతున్న అభాగ్యులకు పండ్లు, బిస్కెట్లు, మంచినీటి బాటిళ్లు అందజేసి ఉదారతను చాటుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖానలో కరోనా బాధితులకు పండ్లు, డ్రైప్రూట్స్ పంపిణీ చేస్తున్నారు. కరోనా అపత్కాలంలో సేవలందిస్తున్న జర్నలిస్టులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో మాస్క్‌లు, అద్దాలు, డ్రై ప్రూట్స్ పంపిణీ చేశారు. సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడం గొప్ప విషయం.
ఈ నెల 17న రక్తదాన శిబిరం..
కరోనాతో నిత్యావసర సరుకుల కోసం ఎదురు చూసే అభాగ్యులు, కనీసం కడుపునిండా భోజనానికి అల్లాడే వారిని గుర్తించి సేవ చేయడమే గాక రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 32 బాటిళ్ల రక్తం సేకరించారు. ఈ నెల 17న సంగారెడ్డి పట్టణంలోని సాహితీ ప్రైవేట్ దవాఖానలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి, సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఎస్పీ బాలాజీ, రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు వనజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. భవిష్యత్‌లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి ఆపదలో ఉన్నవారికి అందజేసేందుకు సమితి ముందుంటుందని, నిరంతర సేవలు నిరాడంబరంగా కొనసాగించేందుకు కమిటీ సభ్యులు కొంత డబ్బును సమకూర్చుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు తెలిసింది. నెలన్నర రోజుల్లో చేసిన సేవలకు పలువురి మదిలో సేవా సమితి పేరు పలకడం సేవా సమితిలో సభ్యుల గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది.
సమితి సేవలు నిరంతరం
సేవ చేస్తూ సమాజంలో ఆదర్శంగా నిలవాలన్నదే సేవా సమితి లక్ష్యం. అయ్యప్ప ఆపద్బాంధు సేవా సమితి ద్వారా నిరంతరం సేవలు అందిస్తాం. అభాగ్యులు ఎంతో మంది ప్రధాన రోడ్లు, రహదారులపై కనిపిస్తూ బుక్కెడు బువ్వకోసం వెంపర్లాడుతున్నారు. అలాంటి వారిని సమితి సభ్యులు గుర్తించి మా దృష్టికి తెచ్చిన వెంటనే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. సమితిలో సభ్యులుగా ఉన్న ప్రతిఒక్కరి సహాయంతో భవిష్యత్‌లో కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహిస్తాం.
పేదలకు అండగా సేవా సమితి
సమాజంలో పేదలకు అండగా నిలిచి సేవా సమితి సేవ చేయడం సం తోషంగా ఉంది. సమితిలో ఒక సభ్యుడిగా చేర్చిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. పని తాను చేసుకుంటూ పోతే గుర్తింపు రాదు. అదే ఒక సమూహంగా తయారై సేవ చేస్తే ప్రజలు, నలుగురికి తెలిసి వారు అభినందించడం గొప్పవిషయంగా భావిస్తాం. అలాంటి సేవలు చేస్తూ సమితికి మంచి పేరు రావాలని ఆకాంక్ష.