సిర్గాపూర్, మార్చి18: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజలంపాడ్‌కు చెందిన పేద రైతు బిరాదార్ పండరీనాథ్రావు, కమలాబాయి దంపతుల రెండో కుమారుడు మనోహర్‌రావు. భార్య మనీషా గృహిణి. వీరికి ఇద్దరు సంతానం. తండ్రి, అన్న నీలకంఠరావు వ్యవసాయం చేస్తుంటారు. తల్లి అంగన్వాడీ టీచర్. ప్రస్తుతం రంగారెడ్డి కలెక్టరేట్లో భూ గరిష్ట పరిమితి చట్టం సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నారు.
విద్యాభ్యాసం సాగింది ఇలా…
ప్రాథమిక విద్యాభ్యాసం సొంత గ్రామం ఉజలంపాడ్లో జరిగింది. 6 నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ వరకు నారాయణఖేడ్‌లో చదివాడు. హైదరాబాద్‌లోని వీవీ కళాశాలలో 2010-2012లో పీజీ పూర్తిచేశాడు. ఎంఏ ఎకానమిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2014లో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన మనీషాతో వివాహం జరిగింది. 2013-17 వరకు సర్కారు కొలువు కోసం ప్రిపరేషన్ అయ్యాడు. 2016లో మొదటిసారి గ్రూప్-2 పరీక్ష రాయగా, ఆ ఫలితాల్లో స్టేట్ మూడో ర్యాంకు, జోన్-6లో మొదటి ర్యాంకు సాధించి, డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. గ్రూప్-2 ఫలితాలపై కోర్టులో కేసు పడటంతో ఉద్యోగానికి ఆలస్యమైంది. ఇంతలో 2017లో పీజీటీ, టీజీటీ పరీక్షలు రాయగా పీజీటీ స్టేట్‌లో మూడో ర్యాంకు రాగా, టీజీలో స్టేట్‌లో మొదటి ర్యాంకు వచ్చింది. వెంటనే టీజీటీ వదిలేసి 2018లో గురుకులంలో పీజీటీగా వైస్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించాడు. అంతలోనే టీఆర్టీ నోటిఫికేషన్ రాగానే పరీక్షలు రాసి ఉమ్మడి మొదక్ జిల్లాలోనే రెండో ర్యాంకు సాధించాడు. దీంతో పీజీటీ వదిలేసి 2019 జూలైలో నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(సోషల్)గా విధుల్లో చేరాడు. 2020 ఫిబ్రవరిలో నాయబ్ తహసీల్దార్ కొలువుకు పిలుపు రాగానే విధుల్లో చేరాడు.
భార్య నగలు అమ్మి పుస్తకాలు కొన్నా..
గ్రూప్-2 పోటీ పరీక్షలకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు నా భార్య మనీషా సహకారం తోడైంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఖరీదైన పుస్తకాలు కొనేందుకు ఆమె తన ఒంటి మీది బంగారు నగలు అమ్మేసి, డబ్బులిచ్చింది. రూమ్ రెంట్ తదితర ఖర్చులన్నీ నగలు అమ్మిన డబ్బులతోనే గడిచింది. 2015లో గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది. కష్టపడి చదివి పరీక్షలు రాసి ఉత్తమ ఫలితం సాధించా. దీనికోసం హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నా. రోజుకు 8 గంటలు చదువుకునేవాడిని. కోచింగ్‌లో అందించిన స్టడీ మెటీరియల్, కరెంట్ అఫైర్స్, నా విజయంలో కీలక పాత్ర పోషించాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, ఎకనామిక్స్ మెటీరియల్, భారత రాజ్యాంగానికి సంబంధించి రమాదేవి పుస్తకం, జనరల్ స్టడీస్ కోసం చాలా పుస్తకాలు చదివా. న్యూస్ పేపర్లు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై పూర్తి అవగాహనతో ప్రిపేరయ్యా. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సిలబస్‌పై పూర్తిగా అవగాహన ఉండాలి. ప్రామాణిక పుస్తకాలు చదవాలి. సొంతంగా నోట్స్ రాసుకుంటే చాలా మంచిది.
– బిరాదార్ మనోహర్‌రావు, నాయబ్ తహసీల్దార్