Sangareddy | కల్హేర్/సిర్గాపూర్, మార్చి 29: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి మరో గురుకుల విద్యార్థి బలయ్యాడు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని గురుకుల పాఠశాల ముందు ధర్నాకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. పెద్డ శంకరంపేట మండలం చీలపల్లి గ్రామానికి చెందిన దార నిఖిల్ కుమార్ (14) సిర్గాపూర్ మండలం పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆహారం బాగోలేకపోవడంతో వారం రోజులుగా అతను సరిగ్గా భోజనం చేయడం లేదు. దీంతో విద్యార్థి ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని నిఖిల్ తల్లిదండ్రులకు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తెలియజేశాడు. కంగారుపడిపోయిన తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకుని.. నిఖిల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నారాయణఖేడ్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సంగారెడ్డికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేసిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం విద్యార్థి నిఖిల్ మృతిచెందాడు.
గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మరణించాడని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. విద్యార్థి మృతదేహంతో గురుకుల పాఠశాల ముట్టడికి యత్నించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో మార్గమధ్యలోనే వారిని అడ్డుకుని.. పాఠశాల వైపునకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. రూ.10లక్షల ఎక్స్‌గ్రేసియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గురుకులాలపై నిర్లక్ష్యం తగదన్న మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో గురుకులాలు అధ్వాన్నంగా తయారయ్యాయని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థి నిఖిల్ తల్లిదండ్రులు, బంధువులు, దళిత సంఘాల నాయకులు చేపట్టిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాలు అధ్వాన్నంగా తయారై విద్యార్థుల పాలిట శాపాలుగా మారిపోయాయని ధ్వజమెత్తారు. నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రిన్సిపల్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా విద్యార్థి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేసియా చెల్లించి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒకరికి ఉద్యోగంపై హామి
బాధిత కుటుంబం ఆందోళన గురించి తెలియగానే నారాయణఖేడ్ ఆర్డీవో అశోక చక్రవర్తి నల్లవాగు గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలల ఆర్సీవో నిర్మలతో ఫోన్లో మాట్లాడారు. దీనికి స్పందించిన ఆమె.. విద్యార్థి అంత్యక్రియల కోసం రూ.50 వేల నగదు అందజేసి, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించి, ధర్నాను విరమించారు.