సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 5: వివిధ ఫార్మా కంపెనీల్లో పని చేసే మహిళా ఉద్యోగుల భద్రత, రక్షణ కోసం షీ షటిల్ బస్ సర్వీసులు ఏర్పాటు చేశామని సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్ఎస్ఎస్సీ) తరఫున న్యూలాండ్ కంపెనీ సహకారంతో షీ షటిల్ బస్ సర్వీస్‌ను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ రమణ కుమార్, అదనపు ఎస్పీ నితికపంత్ జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అనేక రకాల నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఎస్ఎస్ఎస్సీ సంస్థను రూపొందించామన్నారు.
ఈ సంస్థ పోలీస్, ఫార్మా కంపెనీల అనుసంధానంతో నడుస్తుందని తెలిపారు. ఈ బస్సు గండిమైసమ్మ నుండి బొంతపల్లి రూట్లో నడుస్తుందని, ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగులందరికీ ఎలాంటి చార్జీలు లేకుండా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ బస్సు జీపీఎస్‌కి అనుసంధానమై ఉంటుందని, దీనిద్వారా షీ సేఫ్ యాప్‌ను ఉపయోగించి ఈ బస్సు ఏయే సమయానికి ఎక్కడ ఉందనే సమాచారం సులువుగా తెలుసుకోవచ్చన్నారు.
ఈ బస్సులో మహిళల భద్రతకు అవసరమైన మహిళా పోలీసులను నియమిస్తామని, ఇతర కంపెనీలు కూడా మహిళల భద్రత కోసం ముందుకు వచ్చి మరిన్ని బస్సులను ప్రారంభించాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు, న్యూలాండ్ కంపెనీ ప్రతినిధులు శ్రీరామ్, శ్రీనివాస్‌రెడ్డి, సూర్యనారాయణ, మహేందర్‌రావు, శారద, రవి, భాస్కర్, శివకుమార్, న్యూలాండ్ కంపెనీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.