సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 4: స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ మాట్లాడారు. జిల్లాలో ఖాళీగా ఉన్న వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు స్పష్టంచేశారు. ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను ఈ నెల 8న ఆయా మున్సిపాలిటీ వార్డులు, గ్రామ పంచాయతీ వార్డుల్లో ప్రదర్శించాలని సూచించారు. జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ నెల 12న సమావేశం నిర్వహించాలని కలెక్టర్‌కు తెలిపారు. జాబితాపై వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి, వాటిని ఈ నెల 19 వరకు పరిష్కరించాలన్నారు. ఈనెల 21నాటికి తుది జాబితాను వార్డుల వారీగా తయారు చేసి నోటిఫై చేయాలని జిల్లా పంచాయతీ అధికారులకు సూచించారు.
జిల్లాలో 91 వార్డులు, 11 సర్పంచ్ స్థానాలు ఖాళీ
సంగారెడ్డి కలెక్టర్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో 91 వార్డు మెంబర్లు, 11 సర్పంచ్‌లు, 2 ఎంపీటీసీ, 2 మున్సిపల్ వార్డు మెంబర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఫొటో ఓటరు జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఎలాంటి కోర్టు కోసులు లేవని, ఎన్నికల కోసం అన్నివిధాలుగా సిద్ధంగా ఉంటామని పేర్కొన్నా రు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీ ఈవో ఎల్లయ్య, డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో..
మెదక్, ఏప్రిల్ 4: మెదక్ జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచ్, పంచాయతీ వార్డులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, మున్సిపాలిటీ వార్డుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ జిల్లాలో ఒక జడ్పీటీసీ, 5 ఎంపీటీసీలు, సర్పంచ్, 73 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయని, మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి వార్డు సభ్యులు ఖాళీలు లేవని తెలిపారు. జనవరి 5న వెలువరించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం ఈ నెల 8న ఓటర్ల జాబితా ప్రక్రియను మొదలు పెట్టి, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించి, 21న తుది జాబితా విడుదల చేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో శైలేశ్, డీపీవో తరుణ్‌కుమార్ పాల్గొన్నారు.